Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!

Basil Joseph Aa

Basil Joseph Aa

మలయాళ స్టార్ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ తన కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఆయన.. 2026లో మాత్రం సోలో హీరోగా పెద్దగా సినిమాలు చేయలేదు. క్యామియో పాత్రలు, మల్టీస్టారర్ చిత్రాలకే పరిమితమయ్యారు. దీనికి కారణం ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌తో తెరకెక్కించబోయే ప్రాజెక్ట్ అని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ ఏడాది బాసిల్ జోసెఫ్ ‘పరాశక్తి’, ‘మాలీవుడ్ టైమ్స్’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అలాగే మల్టీస్టారర్ మూవీ ‘అతిరధి’లో హీరోల్లో ఒకరిగా నటించారు. ఈ సినిమా విజయంతో నటుడిగానే కాకుండా.. నిర్మాతగా లాభాలు వచ్చాయి. అయితే సోలో హీరోగా మాత్రం బాసిల్ నుంచి సినిమా విడుదల కాలేదు. హీరోగా నటించిన చివరి చిత్రం ‘మరణమాస్’. ఆ తర్వాత ఏడాదిన్నర కాలంగా మరో సోలో ప్రాజెక్ట్‌లో కనిపించలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో గతంలోనే అంగీకరించిన తమిళ చిత్రం ‘రావడి’, ‘మంజేశ్వరం మాఫియా’ ఉన్నాయి. రావడిలోనూ పూర్తి స్థాయి హీరో పాత్ర కాదని, క్యామియో తరహా పాత్ర అని ప్రచారం జరుగుతోంది.

అవకాశాలు లేక కాదు.. స్వయంగా నటనకు కొంత విరామం ఇచ్చి దర్శకత్వంపై దృష్టి పెట్టాలని బాసిల్ జోసెఫ్ నిర్ణయించుకున్నాడట. దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్‌తో చేయనున్న సినిమా అని టాక్. ‘గోదా’, ‘మిన్నల్ మురళి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాసిల్.. ఇటీవల బన్నీకి ఓ కథ వినిపించి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. మాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల అల్లు శిరీష్ వివాహ వేడుకలో బాసిల్ సందడి చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా కోసం బాసిల్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కథ, స్క్రీన్‌ప్లేను పక్కాగా రూపొందించడంపైనే ఆయన దృష్టి పెట్టారని.. అందుకే నటనకు కొంతకాలం విరామం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత బాసిల్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అటు అల్లు అర్జున్.. ఇటు బాసిల్ జోసెఫ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.