టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత కొన్ని రోజులుగా సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాదానికి తెరపడింది. ఈ మేరకు బండ్ల గణేష్‌పై కోర్టులో కేసు వేసిన ఫిర్యాదుదారుడు జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి, తమ మధ్య నెలకొన్న విభేదాలన్నీ పూర్తిగా సమసిపోయాయని స్పష్టం చేశారు. ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో జెట్టి వెంకటేశ్వరరావు పలు ఆసక్తికర, సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రకాశం జిల్లా ముప్పాల గ్రామానికి చెందిన తమకు, బండ్ల గణేష్‌కు మధ్య గత 15 ఏళ్లుగా ఎంతో మంచి సాన్నిహిత్యం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి బండ్ల గణేష్ ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. అయితే, గతంలో తమ కుమారుడు, బండ్ల గణేష్ అందరూ ఎంతో స్నేహంగా ఉండేవారని, కానీ తన కుమారుడు మరణించిన తర్వాత పరిస్థితులు మారాయని తెలిపారు. ఆ సమయంలో తలెత్తిన వ్యక్తిగత ‘ఇగో’ కారణంగానో, లేదా మధ్యవర్తుల ప్రమేయం వల్లనో తమ ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చి, అవి కాస్తా కోర్టు కేసుల వరకు దారితీశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నవంబర్ 18న ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత, తాము వద్దని చెబుతున్నా వినకుండా కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూల పేరుతో అనవసరపు హడావుడి చేశారని వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక పరమైన లేదా వ్యక్తిగత సమస్యలు లేవని, అన్ని విషయాలను సామరస్యంగా పరిష్కరించుకున్నామని ఆయన తేల్చి చెప్పారు. గతంలో ఉన్నట్లే ఇకపై కూడా బండ్ల గణేష్‌తో తన స్నేహం, అనుబంధం కొనసాగుతాయని జెట్టి వెంకటేశ్వరరావు ప్రకటించడంతో ఈ వివాదానికి పూర్తిస్థాయిలో ముగింపు పలికినట్లయింది.

