క్రిస్మస్ కానుకగా థియేటర్లలో నవ్వుల విందును పంచేందుకు ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’ సిద్ధమైంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో ఆకట్టుకున్న ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తాజాగా విడుదల చేశారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ.. సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “మా సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ లాంటి చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలా ఉంటుంది. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వస్తున్నాం. నా శ్రేయోభిలాషి బుచ్చిబాబు గారు ఈ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ‘ఇలా చూసుకుంటానే’, ‘లేలో’ వంటి పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు అన్ని పాటలకూ సాహిత్యం అందించడం మా అదృష్టం” అని తెలిపారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
