Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!

  • ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్
  • ప్రభాస్'బాహుబలి 3'పై అధికారిక ప్రకటన
  • ప్రభాస్ అంకితభావంపై ప్రశంసలు
  • మరోసారి మహిష్మతి ప్రపంచంలోకి
Baahubali 3 Officially Announced

Baahubali 3 Officially Announced

Baahubali 3 Officially Announced By Prabhas and SS Rajamouli: భారతీయ సినీ చరిత్రను మార్చేసిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీకి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా వెనుక జరిగిన అసలు ప్రయాణాన్ని ఎంతో భావోద్వేగంగా చూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు చిత్ర బృందంలోని పలువురు కీలక సభ్యులు కనిపించారు. మహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు?, అంత భారీ విజన్‌ను తెరపైకి తీసుకురావడంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?.. వంటి ఆసక్తికర అంశాలను ఇందులో వివరించారు.

ప్రభాస్ అంకితభావంపై ప్రశంసలు:

ప్రత్యేకంగా హీరోహీరోయిన్లనే కాకుండా.. వందలాది మంది టెక్నీషియన్లు, స్టంట్ ఆర్టిస్టులు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సభ్యులు, అసిస్టెంట్లు చేసిన కష్టాన్ని కూడా డాక్యుమెంటరీలో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాక్యుమెంటరీ చూసిన అభిమానులు రెబల్ స్టార్ ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి కోసం తన కెరీర్‌లో ఎన్నో సంవత్సరాలను అంకితం చేసిన ప్రభాస్ కృషి అసాధారణమని కొనియాడుతున్నారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్‌ను మళ్లీ గుర్తు చేసుకుంటూ అభిమానులు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. చాలామంది ప్రేక్షకులు డాక్యుమెంటరీ చివరి ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్‌గా ఉందని అంటున్నారు. రాజమౌళి విజన్‌ను నమ్మి, అంత భారీ ప్రాజెక్టును నిర్మించడానికి సాహసం చేసిన నిర్మాత శోభు యార్లగడ్డ పాత్ర ఎంతో గొప్పదని అభిమానులు పేర్కొంటున్నారు.

‘బాహుబలి 3’పై అధికారిక ప్రకటన:

డాక్యుమెంటరీ చివర్లో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి గురించి మాట్లాడిన రాజమౌళి.. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లోని ప్రసిద్ధ డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఈ కథ ఇంకా ముగియలేదనే సంకేతం ఇచ్చారు. ఆ వెంటనే ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి ‘బాహుబలి 3’ అధికారికంగా రానుందని ప్రకటించారు. అనంతరం స్క్రీన్‌పై ‘The Legacy Continues’ అని ప్రదర్శించారు. ఈ ప్రకటనతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో #Baahubali3 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. విషయం తెలిసిన రెబల్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోసారి మహిష్మతి ప్రపంచంలోకి:

2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకురావడంలో ఈ ఫ్రాంచైజీ కీలక పాత్ర పోషించింది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ఈ చిత్రాలు విజువల్ స్టోరీటెల్లింగ్‌కు కొత్త ప్రమాణాలు సృష్టించాయి. ఇప్పుడు ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ ద్వారా ఆ అద్భుత ప్రయాణాన్ని మరోసారి ప్రేక్షకులు ఆస్వాదిస్తుండగా.. ‘బాహుబలి 3’ అధికారిక ప్రకటనతో మహిష్మతి కథ మరో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. అభిమానులు ఇప్పుడు ఆ మహా ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వారణాసి’ తర్వాత బాహుబలి మూడో భాగం పనులన జక్కన్న ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.