సినిమాల విషయంలో టాలీవుడ్ కి, బాలీవుడ్ కి పెద్దగా తేడా ఏముండదు! హిందీ చిత్రాల మార్కెట్ మనకంటే పెద్దదైనా ప్రతీ యేటా తెలుగు సినిమాలు చాలానే వస్తుంటాయి. బీ-టౌన్ తో సంఖ్యాపరంగా మనం ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాం. అయితే, ఓటీటీలు వచ్చాక హిందీ ఎంటర్టైన్మెంట్ స్వరూపం భారీగా మారిపోయింది. ఇప్పటికీ థియేటర్లు, బాక్సాఫీస్, కలెక్షన్స్ ముచ్చట సాగుతోన్నా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తమ తడాఖా చూపించటం ఎప్పుడూ మొదలు పెట్టేశాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ సినిమాలతో ఓటీటీలకు చేరుకుంటున్నారు. వెబ్ సిరీస్ లలో చకచకా నటించేస్తున్నారు. తెలుగులో అటువంటి పరిస్థితి ఎంత మాత్రం లేదు…
టాలీవుడ్ లో ఓటీటీలు అంటే అందరూ చెప్పేది అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటివే! ప్రత్యేకంగా తెలుగు వారి కోసమే నడిచే డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ మాత్రమే! అల్లు అరవింద్ తొలి అడుగు వేసి ఆన్ లైన్ లో సత్తా చాటుతున్నప్పటికీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. మరి ఈ క్రమంలో ఇంకో తెలుగు ఓటీటీ ఎప్పటికి వస్తుంది? ‘సోనీ లివ్’ ఆ లోటు తీర్చబోతోందట!
‘సోనీ లివ్’ యాప్ ఇప్పటికే స్మార్ట్ స్క్రీన్ ఆడియన్స్ కు హిందీలో ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. అయితే, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయంలో సోనీ లివ్ కు పెద్దగా సక్సెస్ రాలేదు. ఈ మధ్య వచ్చిన ‘స్కామ్ 1992’ మాత్రమే బాగా ట్రెండ్ అయింది. హిందీలో ఇంకా చాలా సాధించాల్సి ఉంది. అయితే, ఈ లోపు తెలుగులోనూ ‘సోనీ లివ్’ కాలుమోపుతోందట. ప్రత్యేకంగా తెలుగు వీక్షకుల కోసం ఓ వేదిక సిద్ధం అవుతోందని సమాచారం. ఫిల్మ్ మేకర్ మథుర శ్రీధర్ దీనికి హెడ్ గా వ్యవహారిస్తారట.
భారీ బడ్జెట్, బోలెడు నిర్మాణ అనుభవంతో రంగంలోకి దిగిన అల్లు అరవింద్ కూడా తమ ‘ఆహా’తో జనం చేత ‘’ఆహా’’ అనిపించటం కొంచెం కష్టంగానే ఉంది. మరి ‘సోని లివ్’ ‘వావ్’ అనిపించగలుగుతుందా? వేచి చూడాలి! ఎందుకంటే, వెబ్ కంటెంట్ కేవలం డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాదు. బడ్జెట్ తగ్గినా క్రియేటివిటి పెరగాలి. సినిమాల్లో చూపని విధంగా లవ్, రొమాన్స్, సెక్స్ అండ్ వయొలెన్స్ లాంటివి బోల్డ్ గా చూపించగలగాలి! ఏదో డైలీ సీరియల్ మాదిరిగా కథని చుట్టేస్తే, అంతే సంగతులు! లెట్స్ వెయిట్ ఫర్ ‘సోని లివ్’ ఓటీటీ…