టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో అగ్ర దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ చిన్న సినిమా పోస్టర్ చూసి ఇంప్రెస్ అవ్వడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న “కుకూన్స్” (Cocoons) చిత్ర పోస్టర్‌ను అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా లాంఛ్ చేశారు. ఈ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “కుకూన్స్” పోస్టర్ చాలా కొత్తగా ఉండి తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. దర్శకుడు మహేశ్ గౌరి సరికొత్త ఆలోచనలు, విజన్ ఈ పోస్టర్‌లోనే స్పష్టంగా కనిపిస్తున్నాయని, సినిమా టైటిల్ కూడా చాలా వైవిధ్యంగా ఉందని ఆయన కితాబిచ్చారు.
ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న మరో ఆసక్తికరమైన విషయాన్ని అనిల్ రావిపూడి పంచుకున్నారు. ప్రముఖ టెలివిజన్ షో ‘డ్రామా జూనియర్స్’కు మెంటార్‌గా వ్యవహరించి ఎంతోమంది చిన్నారుల యాక్టింగ్ టాలెంట్‌ను వెలికితీసిన వికాస్ చైతన్య.. ఇప్పుడీ “కుకూన్స్” సినిమాతో నటుడిగా, అందులోనూ వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వికాస్ తో పాటు జగన్, సాగర్ మరియు చిత్ర బృందానికి అనిల్ రావిపూడి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్లలో సందడి చేయనుంది.

