ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. టాలీవుడ్‌ను పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ నేరుగా కాకుండా ఒక పక్కా ప్రణాళికతో సాగనుంది. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కీలక ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. తొలుత సినిమాటోగ్రఫీ, హోంశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఒక అంతర్గత సమావేశం జరుగుతుంది. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, పరిపాలనాపరమైన చిక్కులను ఈ సమావేశంలో అధికారులు క్షుణ్ణంగా చర్చిస్తారు.
Also Read:Jana Nayagan: రివర్స్ రీమేక్.. దూరమైన సితార
అధికారుల సమీక్ష ముగిసిన అనంతరం, పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు, దర్శకులతో ప్రభుత్వం నేరుగా భేటీ అవుతుంది. అధికారుల నివేదిక ఆధారంగా ఆచరణాత్మక పరిష్కారాలను ఇక్కడ ఖరారు చేస్తారు. పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ సినిమా టికెట్ రేట్లు. గత ప్రభుత్వ హయాంలో ఈ విషయంలో నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ వ్యయంతో రూపొందే సినిమాల విషయంలో టికెట్ రేట్ల పెంపుదలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించనున్నారు. ప్రతిసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక స్థిరమైన నిబంధనలు తెచ్చే అవకాశం ఉంది.
Also Read: Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?
ఏపీలో షూటింగ్ జరుపుకునే సినిమాలకు ప్రత్యేక రాయితీలు లేదా టికెట్ రేట్ల విషయంలో అదనపు వెసులుబాటు కల్పించడం ద్వారా రాష్ట్రంలో సినిమా షూటింగ్స్ ను ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సమావేశం ప్రాధాన్యతను వివరిస్తూ, “చిత్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం సానుభూతితో వింటోంది. ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ, పెద్ద సినిమాల పెట్టుబడి భద్రత రెండూ మాకు ముఖ్యమే. త్వరలోనే ఈ సమావేశానికి సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటిస్తాం” అని పేర్కొన్నారు. ఈ సమావేశం విజయవంతమైతే, అది ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు మరియు ప్రేక్షకులకు కూడా ఊరటనిస్తుంది. ముఖ్యంగా ‘సింగిల్ విండో’ పద్ధతిలో షూటింగ్ అనుమతులు, నూతన ఫిల్మ్ పాలసీ వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
