Ameer Log : ‘అమీర్ లోగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Ameerlog

Ameerlog

హైదరాబాద్ నగరం అంటే కేవలం చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు, ఇక్కడి బస్తీల్లో ఉండే మనుషులు, వారి ఆప్యాయతలు, సంస్కృతి అంతకంటే ప్రత్యేకమైనవి. ఆ నగర ఆత్మను (Soul), బస్తీల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ రూపుదిద్దుకున్న నూతన చిత్రం ‘అమీర్ లోగ్’. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ ఆగస్ట్ 21న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తోంది.

ఈ సందర్భంగా దర్శకడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ నగరంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. “మాది నల్గొండ జిల్లా రాఘవపురం అయినప్పటికీ, 1997లోనే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాను. ఇక్కడి అనేక ప్రాంతాల్లో నివసించిన నా అనుభవంతో బస్తీలలో ఉండే సజీవమైన మనుషులను తెరపై చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాను. ముందుగా మా చిత్రబృందానికి, ఆ తర్వాత స్పిరిట్ మీడియా టీమ్‌కు ప్రదర్శించి చూపించాం. కథలోని సహజత్వం నచ్చడంతో రానా స్పిరిట్ మీడియా వారు మాకు అండగా నిలిచారు. నిజానికి డబ్బున్న వారు అమీర్ లోగా? లేక మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా? అనేది ఈ సినిమా చూస్తే స్పష్టమవుతుంది. నీతి బోధలా కాకుండా ఒక అంతర్గత ఫిలాసఫీతో సాగే ఈ చిత్రం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ హైదరాబాదీల మీద మరింత ప్రేమ, గౌరవం పెరుగుతాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు ఈ వేదికపై స్మరణ్ సాయి సంగీతంలో రూపుదిద్దుకున్న ‘అవ్వల్ దావత్’ అనే మాస్ దక్కనీ సాంగ్‌ను విడుదల చేశారు. మనోజ్ కుమార్ సాహిత్యం అందించగా రాహుల్ పాడిన ఈ పాట ప్రస్తుతం సంగీతప్రియులను ఆకట్టుకుంటోంది.