‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.. డిసెంబర్ 17 న సినిమా విడుదల కానుండడంతో అల్లు అర్జున్ ఇంటర్వ్యూలు , ప్రెస్ మీట్లకు అటెండ్ అవుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల మీడియాలను కవర్ చేస్తున్నాడు. నేడు బెంగుళూరు వెళ్లి కన్నడ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్ లో ‘పుష్ప’ సినిమా విశేషాలను పంచుకున్న బన్నీ దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకున్నారు.
ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన త్వరలోనే పునీత్ కుటుంబాన్ని కలుస్తానని తెలిపారు. ” ఇప్పుడు బెంగుళూరు వచ్చాను.. పునీత్ ఫ్యామిలీని కలవను.. ఎందుకంటే నేను వచ్చింది మూవీ ప్రమోషన్స్ కోసం .. ఇలాంటి సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడం నాకు నచ్చదు” అంటూ చెప్పుకొచ్చాడు. పునీత్ రాజ్ కుమార్ గత నెల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.
