Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్

Allu Aravind Dulquer

Allu Aravind Dulquer

Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హీరో దుల్కర్ సల్మాన్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. నేచురల్ స్టార్ నాని తర్వాత అలాంటి సున్నితమైన, హృదయాన్ని హత్తుకునే పాత్రలకు దుల్కర్ సల్మాన్ మాత్రమే కరెక్ట్ అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

వేదికపై దుల్కర్ సల్మాన్ వ్యక్తిత్వం, నటన గురించి అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “సాధారణంగా ఇలాంటి ఎమోషనల్, హానెస్ట్ క్యారెక్టర్స్ చేయాలంటే మనకు నాని గారు గుర్తొస్తారు. ఆయన ఇలాంటి పాత్రలను ఎంతో అద్భుతంగా పోషిస్తారు. అలాంటి క్యారెక్టర్స్ ఆయనే చేయాలని మనం అనుకుంటాం. కానీ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చూశాక నాని తర్వాత అంత బాగా చేయగల నటుడు దుల్కరే అనిపించింది” అని అల్లు అరవింద్ కొనియాడారు. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ దుల్కర్ చాలా సున్నితమైన, అందరితో ఒదిగి మాట్లాడే మంచి మనిషి అని, ఈ సినిమా ప్రయాణంలో ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. రషెస్ చూస్తున్నప్పుడు హీరో, హీరోయిన్లు ఇద్దరూ ముద్దొచ్చేశారని, అంత సహజంగా నటించారని ఆయన మెచ్చుకున్నారు.

ఇక ఈ చిత్రంతో పరిచయమవుతున్న కొత్త హీరోయిన్ సాత్విక గురించి అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. మొదట ఈ పాత్రకు ఒక పెద్ద స్టార్ హీరోయిన్‌ను అనుకున్నామని, కానీ సాత్విక ఆడిషన్ చూశాక ఆమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యామన్నారు. “ఆమె ఫస్ట్ రష్ చూసిన తర్వాత ‘అమ్మ బాబోయ్, ఇదేం ఆర్టిస్ట్ రా బాబు’ అనిపించింది. ఆమె ఒక పెద్ద బాంబు, థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయం. అందుకే రిలీజ్ కాకముందే గీతా ఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలకు కాంట్రాక్ట్ రాసించుకున్నాను” అని అన్నారు.

తాను దశాబ్దాలుగా సినిమాలు తీస్తూ దాదాపు 45 నుంచి 50 బ్లాక్ బస్టర్లు అందించానని, కానీ ఈ సినిమా తయారు చేసేటప్పుడు ఒక కొత్త ఎక్సైట్‌మెంట్ కలిగిందని అల్లు అరవింద్ చెప్పారు. డబ్బులు ఎంత వస్తాయనే దానికంటే, ఇంత గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామనే ఆనందమే తనకు కిక్ ఇచ్చిందన్నారు. అలాగే తన ప్రాణమిత్రుడు అశ్వినీదత్‌తో 7 సినిమాలు చేశానని, ఇప్పుడు ఆయన కుమార్తె స్వప్న దత్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. ఇక జీవీ ప్రకాష్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాదని, ఆయనొక పెద్ద ఆర్గనైజేషన్ అని అభినందించిన అల్లు అరవింద్, తెర వెనుక కష్టపడిన విద్య, స్వప్న దత్, దర్శకుడు పవన్, సందీప్, బన్నీ వాసులపై ప్రశంసలు కురిపించారు.