Site icon NTV Telugu

Mangalavaaram: కొరటాల శివ నిర్మాణంలో ‘మంగళవారం 2’?

Mangalavaram

Mangalavaram

వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, గతేడాది ‘మంగళవారం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటారు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ సిద్ధమవుతోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అజయ్ భూపతి, అ ‘శ్రీనివాస మంగాపురం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అజయ్ భూపతి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మంగళవారం 2’ లైన్‌ను కొరటాల శివకు వినిపించినట్లు తెలుస్తోంది. అజయ్ చెప్పిన పాయింట్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉండటంతో, కొరటాల శివ ఆయన స్నేహితుడు, నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

‘మంగళవారం’ సినిమా టెక్నికల్‌గా, కంటెంట్ పరంగా ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ నటన, అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. ఇప్పుడు దానికి సీక్వెల్ అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మొదటి పార్ట్ లో మిగిలిపోయిన చిక్కుముడులను విప్పుతూ, మరింత భయంకరమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా పార్ట్-2ను అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ సీక్వెల్ కు సంబంధించిన చర్చలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అయితే అన్నీ కుదిరితే అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో, సినిమా స్కేల్ సహా బడ్జెట్ భారీగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

Exit mobile version