‘మహా సముద్రం’ చిత్రంతో అతి పెద్ద పరాజయాన్ని అందుకున్న బ్యూటీ అదితిరావ్ హైదరీ. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘హే సినామిక’ కూడా ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. ఇక కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అమ్మడు ఆడి కారు కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఖరీదైన లగ్జరీ కారును సొంతం చేసుకుంది. ఆడి క్యూ7 ని కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ కారు విలువ అక్షరాలా రూ. 88 లక్షలు. దీంతో లగ్జరీ జర్మన్ కారును కలిగి ఉన్న నటీనటుల జాబితాలో అదితి రావ్ హైదరీ కూడా చేరిపోయింది.
ఇక ఈ విషయాన్ని ఆటో మేకర్స్ తెలుపుతూ “ఆడి ముంబై వెస్ట్ బహుముఖ లగ్జరీ SUVని సొంతం చేసుకున్నందుకు అదితిరావుకి అభినందనలు.. క్వాట్రో ఫ్యామిలీకి స్వాగతం” అని తెలిపారు. ఇక కారు విషయానికొస్తే.. కొత్త ఫీచర్స్ తో ఆడి అదరగొడుతుంది. Q7 3.0 లీటర్ V6 TFSI పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది. ఇది 48 మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో జత చేయబడింది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ 340 hp గరిష్ట శక్తిని .. 500 Nm టార్క్ ని విడుదల చేయగలదు. ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖుల ఫెవరేట్ కారుగా పేరుగాంచింది. ఇకపోతే ప్రస్తుతం అదితి.. మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది.