AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!

Aadarsha Kutumbam 47

Aadarsha Kutumbam 47

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై మొన్నటి వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే వరుస వాయిదాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆసక్తిని క్రమంగా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తున్న పాటలు సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్ తీసుకురావడం లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన ‘నారాయణమ్మ’ పాట తమన్ స్థాయికి తగ్గట్లుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా విడుదలైన ‘మాలా’ పాట కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో తమన్ అందించిన ఓ పాట ట్యూన్‌ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సినిమాపై ఉన్న కొద్దిపాటి క్రేజ్ కూడా తగ్గిపోతోందనే చర్చ జరుగుతోంది. వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలకు కథ, మాటలు అందించి వాటిని కల్ట్ చిత్రాలుగా తీర్చిదిద్దిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆదర్శ కుటుంబంతో దర్శకుడిగా మరోసారి అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయిందనే ఓపెన్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కథ, కామెడీ, ఎమోషన్స్ విషయంలో ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నప్పటికీ.. వాటిని టీజర్, పాటలు పూర్తిగా అందుకోలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎట్టకేలకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుస వాయిదాలతో పాటు ప్రమోషన్లలో వచ్చిన గ్యాప్ కూడా సినిమాపై బజ్ తగ్గడానికి కారణమైందనే చర్చ జరుగుతోంది. గతంలో ప్రమోషన్లను జోరుగా నిర్వహించిన చిత్రబృందం.. సినిమా వాయిదా పడటంతో వాటికి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు విడుదలకు వారం రోజులే సమయం ఉండటంతో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు పాటలు, ప్రమోషనల్ వీడియోలతో ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయిన ఆదర్శ కుటుంబంకు ట్రైలర్ కీలకంగా మారింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ట్రైలర్‌లో ఎంతవరకు కనిపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మరి ట్రైలర్‌తోనైనా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయా? ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి తీసుకొస్తుందా? అనేది చూడాలి.