వెండితెరపై నటనతో మెప్పించే నటీమణుల గ్లామర్ వెనుక ఎన్నో తెలియని నిజాలు, గుండెల్ని పిండేసే జ్ఞాపకాలు దాగి ఉంటాయి. చైనాలో ఎంబీబీఎస్ చదివి, హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేసి.. ఆ తర్వాత సినిమాలపై ఇష్టంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అచ్చతెలుగు నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla). ‘మా ఊరి పొలిమేర’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో ఎదురైన ఘోరమైన లైంగిక వేధింపులు, రిలేషన్‌షిప్స్, మరియు బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సామాజికంగా పెద్ద చర్చకు దారితీశాయి.
ఒక టాక్ షోలో మాట్లాడుతూ.. తాను కేవలం నాలుగేళ్ల వయసులోనే చవిచూసిన లైంగిక వేధింపుల నరకాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు.. కామాక్షి మాట్లాడుతూ.. ‘అందరూ నాలాగా ఆలోచించాలని లేదు.. కానీ నేను కేవలం 4 ఏళ్ల వయసులోనే మొదటిసారి లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ తర్వాత టీనేజ్‌లో కూడా మరో మూడేళ్ల పాటు దారుణమైన వేధింపులను ఎదుర్కొన్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి దారుణమైన పరిస్థితులను అనుభవించిన ఏ అమ్మాయికైనా తన శరీరం మీద ఎలాంటి మోహం ఉంటుంది? అందుకే నా విషయంలో శారీరక కోరికలు, ఆకర్షణలు చచ్చిపోయాయి’ అని తెలిపింది. అంతే కాదు..
‘ఎన్జీవో (NGO) లో చేరకముందు వరకు నా ఒక్కదాని జీవితమే ఎందుకు ఇలా నరకమైంది అని రోజూ ఏడ్చేదాన్ని. కానీ అక్కడ మిగిలిన అమ్మాయిలను కలిశాక, వారు పడిన కష్టాలు విన్నాక స్త్రీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. పల్లెటూళ్లలో మహిళల స్థితిగతులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇది నా జనరేషన్‌లోనే కాదు.. మా అమ్మ, అమ్మమ్మల కాలం నుంచీ సాగుతోంది. ముఖ్యంగా నా జీవితంలో ఇప్పటివరకు 3 బ్రేకప్స్ అయ్యాయి. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగాయి. ఒక రిలేషన్‌లో కేవలం మన స్వార్థం చూసుకోకూడదు, అవతలి వ్యక్తి అంచనాలను కూడా గౌరవించాలి. మా ఇష్టలు వేరువేరుగా ఉంనందు వల్లే మేము విడిపోయాం. ఇక సమాజంలో ‘సెక్స్’ అనే పదాన్ని ఏదో బూతులా చూస్తారు, అది నాకు అర్థం కాదు. చేతులు కలపడం (Shake hand) దగ్గర నుండి సెక్స్ వరకు అన్నీ శారీరక, మానసిక శక్తుల మార్పిడే (Physical Exchange). మనసులోని ఆలోచనలను పంచుకోవడం గొప్పదైనప్పుడు, శారీరక కలయికను తప్పుగా చూడటం కరెక్ట్ కాదు’ అని ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం కామాక్షీ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం సంచలనంగా మారింది. ఆమె ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తూ, చిన్న పిల్లల రక్షణపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
