Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!

Garividi Lakshmi Actress Anandi

Garividi Lakshmi Actress Anandi

Actress Anandi Gets Emotional: తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమ, మద్దతు గురించి మాట్లాడుతూ వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు. సినిమాల్లో ఎన్నో లెక్కలు, రాజకీయాలు ఉంటాయని, కొన్నిసార్లు తాను ఈ రంగానికి సరిపోనేమో అనిపిస్తుందని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. అయితే ప్రేక్షకుల ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని చెబుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆనంది తన సినీ ప్రయాణం, ప్రేక్షకుల ఆదరణ, సినిమాలోని పాత్ర గురించి భావోద్వేగంగా స్పందించారు.

ప్రేక్షకుల ప్రేమే నా బలం:


‘నాకు అప్పుడప్పుడు సినిమా ఫీల్డ్‌కు నేను సరిపోనేమో అనిపిస్తుంది. సినిమాలు చేయడానికి ఎన్నో లెక్కలు, రాజకీయాలు ఉంటాయి. చాలా విషయాలు జరుగుతుంటాయి. కానీ మీ ప్రేమ, మద్దతే నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇండస్ట్రీ నన్ను గుర్తించినా, గుర్తించకపోయినా ప్రేక్షకులు మాత్రం నా నటనను గుర్తు పెట్టుకుంటున్నారు. నేను చేసిన ప్రతి పాత్రను గుర్తుచేసుకుంటూ.. నాకు అవార్డులు రావాలని కోరుకుంటూ అభిమానులు ప్రస్తావించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఈ ఆదరణ నాకు దక్కిన అతిపెద్ద గౌరవం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ ఆనంది భావోద్వేగానికి లోనయ్యారు.

గరివిడి లక్ష్మి పాత్ర కోసం ఎంతో కష్టపడ్డా:
గరివిడి లక్ష్మి సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ స్క్రిప్ట్ వినగానే ఆ పాత్రకు తగిన గుర్తింపు, పేరు రావాలనే ఉద్దేశంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆనంది వెల్లడించారు. ఈ పాత్ర తనకు సవాలుతో కూడుకున్న అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన యాస, భాషను సహజంగా పలకడంతో పాటు పాత్రలోని భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.

అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు సినిమా:
గరివిడి లక్ష్మి సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రంగా ఉంటుందని ఆనంది ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను కచ్చితంగా మిమ్మల్ని నిరాశపరచను. మీ మనసులో ఉండిపోయే సినిమా ఇది. అక్టోబర్ 17న సినిమా విడుదలవుతోంది. తప్పకుండా చూడండి’ అని ప్రేక్షకులను కోరారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఆనంది చేసిన వ్యాఖ్యలు, ప్రేక్షకులపై ఆమె చూపించిన కృతజ్ఞత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.