Ego Raja : లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసిన ఆది సాయికుమార్

Rowdee Raja

Rowdee Raja

‘శంబాల’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన పాత ఇమేజ్‌ను పక్కనపెట్టి పక్కా రా అండ్ రస్టిక్ అవతారంలోకి మారిపోయాడు. గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగో రాజా’తో ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆది కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన ‘రౌడీ రాకాసి’ క్యూట్ లవ్ సాంగ్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మెలోడీలో ఆది సాయికుమార్ లుక్, అతని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే థియేటర్లలో మాస్ జాతర ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా లుంగీ కట్టి ఆది వేసిన ఊర మాస్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది.

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఆ పాటను చిత్రీకరించిన తీరు యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన క్యాచీ లిరిక్స్‌కు, సంగీత దర్శకుడు గిబ్రాన్ వైబోధ అందించిన లైవ్లీ ట్యూన్ ప్రాణం పోసింది. దానికి తోడు సింగర్ శిభి శ్రీనివాసన్ గాత్రం పాటకు మరింత ఊపు తీసుకొచ్చింది. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత జి. సురేష్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ టీమ్ పెద్ద బలం. స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస విజువల్స్, దురైరాజ్ ఆర్ట్ వర్క్, మేఘనాథన్ ఎడిటింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. విభిన్నమైన కథాంశంతో, అద్భుతమైన నటీనటుల ప్రదర్శనతో రాబోతున్న ఈ ‘ఈగో రాజా’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.