Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబో అంటేనే ప్రేక్షకుల్లో ఏదో తెలియని క్రేజ్ ఉంటుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. తాజాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా చిత్రం ఆదర్శకుటుంబం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పుడూ చెప్పే ఫ్యామిలీ, రొమాంటిక్ కామెడీ కథలకు భిన్నంగా ఈసారి సరికొత్త జోనర్‌ను టచ్ చేసినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.
వేదికపై త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మీరు సాధారణంగా ఊహించే పద్ధతిలో అస్సలు ఉండదు. రెగ్యులర్ రొమాంటిక్ కామెడీ ట్రాక్ కాకుండా పూర్తిగా వేరే దారిలో సాగుతుంది. సమాజంలోని కొన్ని ప్రత్యేకమైన అంశాలను టచ్ చేస్తూ క్రైమ్ కామెడీ, బ్లాక్ కామెడీ జోనర్లో ఈ చిత్రాన్ని సిద్ధం చేశాం. ఇలాంటి కొత్త ప్రయత్నం చేయడం అటు వెంకటేష్ గారికి, ఇటు నాకు ఇద్దరికీ ఇదే మొదటిసారి” అని కుండబద్దలు కొట్టారు. షూటింగ్ చేస్తున్నంత సేపు తమకే ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించిందని, వెండితెరపై చూస్తున్నప్పుడు ఆడియన్స్‌కు కూడా కచ్చితంగా సరికొత్త అనుభూతిని పంచుతుందని భరోసా ఇచ్చారు.
ఇక ఈ సినిమా సంగీతం గురించి మాట్లాడుతూ.. రీ-రికార్డింగ్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) అద్భుతంగా వచ్చిందని చెప్పారు. దాదాపు ఏడెనిమిది ప్రత్యేకమైన భాగాలుగా ఉండే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను త్వరలోనే విడిగా విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎప్పుడూ నవ్వులు, సెంటిమెంట్‌తో నడిచే త్రివిక్రమ్ కథల్లో.. ఈసారి క్రైమ్, బ్లాక్ కామెడీ అంశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

