మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి రూట్ మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటేశ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ టైటిల్‌ను ఎంచుకున్నప్పటికీ, విడుదలైన లోగో (టైటిల్ డిజైన్) మాత్రం ఫ్యామిలీలో దాగిన వైలెన్స్‌ను సూచిస్తోంది. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు చిరునామా అయిన వెంకటేష్‌తో, త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారనే ప్రశ్న ఈ లోగోతో మొదలైంది. ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్‌కు అనుబంధంగా లోగోలో కనిపించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌ను షార్ట్ కట్‌లో AK అని తీసుకున్నారు. టైటిల్‌కు ట్యాగ్‌లైన్‌గా ‘హౌస్ నెం 47’ను జత చేశారు.
Also Read:Peddi: పెద్ది వాయిదా ?
AK కింద రక్తపు మరకలతో AK47 అనే అక్షరాలు కనిపించడం చర్చనీయాంశమైంది. టైటిల్ మొత్తం రక్తపు మరకలతో నిండి ఉండటం, ఫ్యామిలీ కథలో ఏదో పెద్ద వైలెన్స్ అంశం దాగి ఉందనే హింట్‌ను ఇస్తోంది. మరి, గురూజీ ఈ ‘ఆదర్శ కుటుంబం’ కథలోకి అంతటి వైలెన్స్‌ను ఎందుకు తీసుకొచ్చారనేది ఇప్పుడందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. గతంలో ‘గుంటూరు కారం’ ఫ్లాప్ అయిన నేపథ్యంలో, త్రివిక్రమ్ మరోసారి తన సక్సెస్ సెంటిమెంట్‌ను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఆయన గత విజయాలన్నీ ‘అ’ అనే అక్షరంతో మొదలైనవే కావడం విశేషం: ‘అ ఆ’, ‘అత్తారింటికి దారేది’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురంలో’. ఇప్పుడు వెంకటేష్‌తో చేస్తున్న సినిమాకు కూడా ‘ఆదర్శ కుటుంబం’ (ఆ) అనే టైటిల్‌ను ఎంచుకోవడం ఈ సెంటిమెంట్ పాటించడంలో భాగమేనని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ బుధవారం మొదలైంది. ఈ ఫ్యామిలీ వైలెన్స్ ఎంటర్‌టైనర్‌ను 2026 సమ్మర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
