టాలీవుడ్‌లో గత కొంతకాలంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకడుగు వేస్తున్నారు. దానికి ప్రధాన కారణాల్లో ఒకటి అధిక టికెట్ ధరలు. పెద్ద బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరో సినిమాలకు టికెట్ రేట్స్ పెరగడం ఓకే కానీ, మధ్యతరహా సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కూడా అదే బాటలో నడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు అడుగులు వేయడానికే భయపడుతున్నారు. అయినా కూడా నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అలాంటి సమయంలో ‘మిరాయ్’ సినిమా చేసిన పని ఇప్పుడు అందరికీ కొత్త దారి చూపిస్తుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో (రూ.60 కోట్ల వరకు) ఈ సినిమాను నిర్మించింది. మైథలాజికల్ టచ్, విస్తృతంగా వీఎఫ్ఎక్స్ సీన్స్, హై లెవెల్ అంచనాలు సెట్ చేసింది. ఇలాంటి సినిమాలకు సాధారణంగా టికెట్ ధరలు పెంచడం సహజమే. కానీ నిర్మాతలు అలా చేయకుండా, నార్మల్ టికెట్ రేట్స్‌తోనే విడుదల చేశారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత ఫలితాలు అందుకుంటోంది. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన మిరాయ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత, టికెట్ ధరలు అందుబాటులో ఉండటం తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు లైన్ కడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు మేజర్ సిటీల్లో ఎక్కువ షోలు ఫుల్ అవుతున్నాయి. ఈ నిర్ణయం టాలీవుడ్ నిర్మాతలకు కూడా ఒక లెసన్‌లా మారింది. ఎందుకంటే సాధారణ టికెట్ ధరలు ఉంటే, ఫుట్‌ఫాల్స్ పెరుగుతాయి, సినిమా లాంగ్ రన్ అవుతుంది, కలెక్షన్స్ కూడా స్టడీగా కొనసాగుతాయి. మొత్తానికి, ‘మిరాయ్’ తీసుకున్న ఈ అడుగు భవిష్యత్ సినిమాలకు కొత్త దారిని చూపించేలా ఉంది. రాబోయే సినిమాలు కూడా ఇదే విధానం అనుసరిస్తే, థియేటర్ కల్చర్ మళ్లీ బలోపేతం కావడమే కాకుండా, నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది.