321 Movie: మైండ్ బ్లాంక్ చేసే కాన్సెప్ట్‌తో ‘321’.. సెన్సేషన్‌గా ‘నను తాకిన’ సాంగ్!

News

News

పెళ్లి అనగానే నేటితరం యువతలో మొదలయ్యే అతిపెద్ద కన్ఫ్యూజన్.. ‘లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? లేక పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా?’ అనేది. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పుడూ ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా యువత నాడిని పట్టుకుని, ఇదే బర్నింగ్ టాపిక్‌ను తెరపైకి తీసుకురాబోతోంది ఓ చిత్రం. అదే ‘321’.. దీనికి ‘లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్’ అనేది ఉప శీర్షిక (ట్యాగ్ లైన్). టైటిల్ తోనే తీవ్ర సంచలనం రేపుతున్న ఈ చిత్రం ఇప్పుడు మ్యూజికల్ గానూ మ్యాజిక్ చేయడం మొదలుపెట్టింది.

బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘నను తాకిన’ పాట శ్రోతలను ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంటోంది. అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టే తొలి ప్రేమలోని మాధుర్యాన్ని, సున్నితమైన భావోద్వేగాలను ఎంతో అందంగా ఈ పాటలో ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు కాల్విన్ జాయ్ అందించిన మనసైన మెలోడీకి.. సింగర్స్ సాయి చరణ్, హరిణి తమ గాత్రంతో ప్రాణం పోశారు. మెహర్ బాబా మాస్టర్ కొరియోగ్రఫీ ఈ లవ్ సాంగ్ కు పర్ఫెక్ట్ గా సింక్ అయింది.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దర్శకుడు శాంతి కుమార్ చిలుముల ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఆయన కేవలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, రామానుజ రెడ్డి వంగపాటితో కలిసి నిర్మాణ బాధ్యతలు కూడా పంచుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇప్పుడు చార్ట్ బస్టర్ గా మారుతున్న ‘నను తాకిన’ పాటకు ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని (లిరిక్స్) కూడా ఆయనే స్వయంగా అందించడం విశేషం. దర్శకుడికి కథపై ఉన్న పట్టు వల్లే ఇంత ఫీల్ గుడ్ లిరిక్స్ వచ్చాయని ప్రశంసలు దక్కుతున్నాయి. మోహిత్, లావణ్య ప్రధాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వివాన్ సూర్య, లక్ష్మీ వెన్నెల, యామిని, శ్రీనివాస్ భోగిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శివ ప్రసాద్ ముప్పాల విజువల్స్ అందిస్తుండగా, శివ శర్వాణి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.