అడవి శేష్… చిత్రపరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం. చిత్రపరిశ్రమలో తనకంటూ ఎలాంటి అండదండలు లేకున్నా ఒక్కో స్టెప్ ఎదుగుతూ… ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న నటుడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి హిట్స్ తర్వాత చక్కటి ఫాలోయింగ్ తెచ్చుకున్న శేష్ ప్రస్తుతం ‘మేజర్’ పేరుతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. రచయిత కావటం శేష్ కి ఉన్న అదనపు బలం. ‘మేజర్’తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అడవిశేష్. ఈ సినిమాకు కథను సమకూర్చుకుంది కూడా తనే. 2008లో ముంబై ఎటాక్స్ లో ఉగ్రవాదులపై పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ‘మేజర్’ తెరకెక్కటం విశేషం. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే 25 మిలియన్స్ వ్యూస్ ని దక్కించుకుంది. మరి టీజర్ లాగే సినిమా కూడా హిట్ అయి అడవి శేష్ కి బాలీవుడ్ లోనూ గుర్తింపు దొరుకుతుందేమో చూడాలి. నిజానికి ఈ తరహా కథాంశాలతో కూడిన సినిమాలకు బాలీవుడ్ లో ప్రజాదరణ బాగుంటుంది. శేష్‌ని కూడా అలాగే ఆదరిస్తారేమో చూద్దాం.
‘మేజర్’ కి అక్కడ ఆదరణ లభిస్తుందా!?
