(ఏప్రిల్ 22తో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’కు పదేళ్ళు)
డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో హీరోగా నటించి, బంపర్ హిట్ కొట్టిన వారికి వెంటనే విజయం పలుకరించదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘ఛత్రపతి’ నిలచింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మాట కొస్తే ‘ఛత్రపతి’ తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ప్రభాస్ కు చాలా రోజులు పట్టింది. ‘మిర్చి’ దాకా ప్రభాస్ కు బంపర్ హిట్ రాలేదు. మధ్యలో తొమ్మిది సినిమాలు వచ్చినా, లాభం లేకపోయింది. వాటిలో అంతో ఇంతో అలరించిన చిత్రంగా ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ నిలచింది. ఈ సినిమా 2011 ఏప్రిల్ 22న విడుదలయింది. ‘సంతోషం’ సినిమాతో దర్శకుడైన దశరథ్ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ను తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
‘మిస్టర్ పర్ ఫెక్ట్’ చిత్రంలో ప్రభాస్, కాజల్ జంటగా నటించారు. ఈ చిత్రానికి ముందు విడుదలయిన ప్రభాస్ చిత్రం ‘డార్లింగ్’లోనూ కాజల్ నాయికగా నటించింది. అందువల్ల కొందరు ఈ సినిమా పేరు చెబితే, ఆ సినిమాను, ఆ చిత్రం పేరు వింటే ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకు కారణం లేకపోలేదు, ‘డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్’ రెండు చిత్రాల్లోనూ నాయికానాయకులు బాల్య స్నేహితులు. ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ విషయానికి వస్తే – ఇందులో హీరో విక్కీ తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ, ఆనందంగా ఉంటాడు. ఇతరుల కోసం త్యాగం చేయవలసిన పనిలేదు అన్నది అతని భావన. అయితే అతని తండ్రి మాత్రం “ఇతరులను సంతోషంగా ఉంచినప్పుడే మనం మరింత ఆనందంగా ఉంటాం” అని చెబుతూ ఉంటాడు. విక్కీ మాత్రం తనకు నచ్చిన దారిలోనే పయనిస్తాడు. అతని బాల్య స్నేహితురాలు డాక్టర్ ప్రియతో అతనికి పెళ్ళి కుదురుస్తారు పెద్దలు. హీరో అధునాతన భావాలకు, హీరోయిన్ సంప్రదాయ పంథాకు పొత్తు కుదరదు. కానీ, ప్రియ మాత్రం విక్కీనే ప్రేమిస్తుంది. విక్కీ ఆస్ట్రేలియా వెళ్ళి, అక్కడ అచ్చు తన భావాలు గల అమ్మాయి మ్యాగీని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. తన కుటుంబసభ్యులతో నాలుగు రోజులు ఉండి, వారి ప్రేమను గెలిచినప్పుడు విక్కీ లవ్ ను అంగీకరిస్తానని మ్యాగీ తండ్రి షరతు విధిస్తాడు. అదే సమయంలో మ్యాగీ అక్క పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళిలో అందరితోనూ కలివిడిగా ఉంటాడు విక్కీ. ఆ పెళ్ళికి ప్రియ కూడా వస్తుంది. ప్రియను చూడగానే విక్కీకి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆమెనే తాను నిజంగా ప్రేమిస్తున్నానని అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఈ లోగా పెండ్లికి వచ్చిన వారందరినీ తన ప్రవర్తనతో ఆకట్టుకుంటాడు విక్కీ. మ్యాగీ తండ్రికి కూడా విక్కీ నచ్చేస్తాడు. మ్యాగీతో విక్కీ పెళ్ళి ఖాయమని అనుకుంటారు. అయితే, తాను నిజంగా ప్రేమిస్తున్నది ప్రియనేనని తెలుసుకొని విక్కీ ఇండియాకు వస్తాడు. విక్కీ ప్రేమను ప్రియ ఆమోదించడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో విక్కీగా ప్రభాస్, ప్రియగా కాజల్, మ్యాగీగా తాప్సీ, ఆమె తండ్రిగా ప్రకాశ్ రాజ్, హీరో తండ్రిగా నాజర్, ప్రియ తండ్రిగా మురళీమోహన్ నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ కథ అందించగా, హరికృష్ణ, అబ్బూరి రవి, ప్రవీణ్ వర్మ స్క్రీన్ ప్లే లో పాలు పంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలరించింది. సీతారామశాస్త్రి, రామజోగయ్య, అనంత్ శ్రీరామ్, బాలాజీ, జి.సత్యమూర్తి పాటలు రాశారు. వాటిలో “చలి చలిగా గిల్లింది…”, “ఆకాశం బద్దలైన…”, “బదలు తోచని…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఎబౌ ఏవరేజ్ గా నిలచింది.