డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ మూవీ ‘పోకిరి’ విడుదలై నేటితో 15 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2006 ఏప్రిల్ 28న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తరువాత మూడేళ్లు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ రికార్డును రామ్ చరణ్ ‘మగధీర’తో బ్రేక్ చేయడం వేరే విషయం అనుకోండి. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా, ఇలియానా ఏరోబిక్ టీచర్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంతో ఇలియానా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు పూరీ ఈ చిత్రంతో మహేష్ కు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను అందించాడు. మహేష్, ఇలియానా కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయి. ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, ఆశిష్ విద్యార్తి, నాసర్, అలీ, అజయ్, బ్రహ్మానందం, మాస్టర్ భారత్, సయాజీ షిండే కీలకపాత్రల్లో నటించారు. ఇక బ్రహ్మానందం ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఈ చిత్రంలో మణి శర్మ స్వరపరిచిన పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. దేవుడా, డోలె డోలె, గల గల, ఇప్పటికింకా, చూడొద్దంటున్నా.. ‘పోకిరి’ విడుదలైన సమయంలో ఎక్కడ చూసినా ఈ సాంగ్స్ విన్పించేవి అంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా ‘పోకిరి’ విడుదలైన దశాబ్దంన్నర తరువాత కూడా ఈ చిత్రానికి ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదు.