Varun Sandesh: వరుణ్ సందేశ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చూస్తుండగానే ఒకటిన్నర దశాబ్దం అయిపోయింది. ‘బిగ్ బాస్ షో’కు భార్యతో కలిసి వెళ్లి వచ్చాక… హీరో పాత్రలను వదిలిపెట్టి ప్రాధాన్యమున్న క్యారక్టర్స్ చేయడం మొదలెట్టాడు. తాజాగా వచ్చిన సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’లో వరుణ్ సందేశ్ కీ-రోల్ ప్లే చేశాడు. అయితే ఇప్పటికీ అతన్ని హీరోగా పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఉంటూనే ఉన్నారు. అలా రూపుదిద్దుకుంటోందే ‘చిత్రం చూడర’ సినిమా.
శేషు మారంరెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ‘చిత్రం చూడర’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం విడుదలైంది. విశేషం ఏమంటే… ఇందులో వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇద్దరూ పోలీస్ స్టేషన్ లో మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే… ఇదేదో క్రైమ్ కామెడీ మూవీ అనే భావన కలుగుతోంది. ఆర్. ఎన్. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘అల్లరి’ రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘నేనింతే’ ఫేమ్ అదితి గౌతమ్ ఐటమ్ సాంగ్ లో నర్తించిందని సమాచారం. రాధన్ సంగీతం అందించిన ఈ మూవీకి జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. గత యేడాది జనవరి 1న వచ్చిన ‘ఇందువదన’ మూవీలో సోలో హీరోగా నటించాడు వరుణ్ సందేశ్. అది నిరాశ పరిచింది. మరి ‘చిత్రం చూడర’ అయినా… అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.