Unstoppable 2: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఆహాలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’ షోను ప్రారంభించడంతోనే అది ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. బాలకృష్ణ తనదైన శైలిలో క్లిష్టమైన, వివాదాస్పదమైన ప్రశ్నలను కూడా సరదాగా సంధించేసి, ఎదుటి వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టడం అందరికీ నచ్చేసింది. బాలకృష్ణ సమకాలీనులైన సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ షో ఫస్ట్ సీజన్‌లో పాల్గొనలేదు. దాంతో ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు ఆ యా స్టార్ హీరోల అభిమానుల మనసులోనూ ఓ సందేహం ఏర్పడింది. తమ హీరోను బాలకృష్ణ ఈ షోకు పిలవరా? లేకపోతే వీరే అక్కడకు వెళ్ళరా అనేది.
Read Also: Power Star: ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’కు పవన్ కళ్యాణ్!?
నిజానికి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ చిరంజీవితో మొదలవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అది మోహన్ బాబుతో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కూడా మధ్యలో చిరంజీవి ఈ షోకు హాజరవుతారనే ప్రచారం సోషల్ మీడియాలో విశేషంగా జరిగింది. బట్ అది కార్యరూపం దాల్చలేదు. చివరి ఎపిసోడ్ అయినా చిరంజీవితో చేస్తారని అంతా అనుకున్నారు. కానీ… ఆ సీజన్ ను మహేశ్ బాబు ఇంటర్వ్యూతో వైండప్ చేశారు. ఈ నేపథ్యంలో సెకండ్ సీజన్ చిరంజీవి ఇంటర్వ్యూతో మొదలువుతుందని మెగాభిమానులు అనుకున్నారు. ఆహా యాజమాన్యం మాత్రం ఓ ప్లానింగ్ తో చంద్రబాబు నాయుడుతో ఈ సెకండ్ సీజన్ కు శ్రీకారం చుట్టింది. అయితే… ఈ షోకు హాజరవుతానని చిరంజీవి ఇప్పటికీ మాట ఇచ్చినందువల్ల తప్పకుండా సీజన్ 2లో ఆయనతో ఇంటర్వ్యూ ఉంటుందని అంటున్నారు. అది మధ్యలో ఉంటుందా? లేక చివరి ఇంటర్వ్యూనే ఆయనతో ఉంటుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే నాగార్జుననూ ఈ షో నిర్వాహకులు ఆహ్వానించారట. కానీ బాలకృష్ణతో ఉన్న వ్యక్తిగతమైన అభిప్రాయ బేధాల కారణంగా నాగ్ ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. ఇక మిగిలిన మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్! అతనితో కూడా నిర్వాహకులు టచ్ లోనే ఉన్నారని, ఈ సీజన్ లో ఏదో ఒక సమయంలో వెంకటేశ్ సైతం ఈ షోలో పాల్గొనే ఛాన్స్ ఉందని అంటున్నారు. యంగ్ హీరోస్ తో పాటు… తన కాంటెంపరరీ హీరోస్ తోనూ బాలకృష్ణ చేసే ఇంటర్వ్యూల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
