Site icon NTV Telugu

Acharya: 80 శాతం తిరిగిచ్చాను, సో… నో రిగ్రేట్స్!

Chiru On Acharya Flop

Chiru On Acharya Flop

Chiranjeevi Reacts On Acharya Flop Again: ‘గాడ్ ఫాదర్’ చిత్రం విడుదలైన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో ఫలు దఫాలుగా సమావేశమయ్యారు. సినిమా విడుదల అనంతం సక్సెస్ మీట్‌లో మాట్లాడిన చిరు… గురువారం తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతోనూ కొంతసేపు సరదా సంభాషణ జరిపారు.

ఆ సమయంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ‘ఆచార్య’ సినిమా పరాజయానికి తాను కృంగిపోలేదని, అలానే ‘గాడ్ ఫాదర్’ విజయానికి పొంగిపోవడం లేదని అన్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించే స్థితికి తాను వచ్చానని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కొన్ని సినిమాలు పరాజయం పాలు అవుతాయని విడుదలకు ముందే తెలిసిపోతుందని, అయితే ప్రొఫెషనలిజంలో భాగంగా దానిని బయటకు చెప్పలేమని అన్నారు. ‘ఆచార్య’ విషయంలోనూ అలాంటి సందేహం తనకు కలిగిందని, కానీ ఆ సినిమా విజయంపై యూనిట్ సభ్యులకు ఉన్న నమ్మకాన్ని తాను తప్పు పట్టలేనని తెలిపారు.

ఆ సినిమా పరాజయం అయిన తర్వాత తన పారితోషికంలోనూ, రామ్ చరణ్ పారితోషికంలోనూ ఎనభై శాతం తిరిగి నిర్మాతలకు చెల్లించామని చిరంజీవి అన్నారు. ఓ సినిమా విజయాన్ని స్వీకరించడంతో పాటు పరాజయం తాలుకు బాధ్యతను కూడా తీసుకోవాలని, ‘ఆచార్య’ విషయంలో తాను అదే చేశానని, అందుకే ఆ సినిమా విషయంలో తనకు ఎలాంటి రిగ్రేట్స్ లేవని స్పష్టం చేశారు.

Exit mobile version