Site icon NTV Telugu

Chiranjeevi: బూతుల రాజకీయాలు నా వల్ల కాలేదు.. అందుకే బయటకు వచ్చేశా..

Padma

Padma

Chiranjeevi: ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయి. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు సినిమాకి చేసిన సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదును వారికి అందజేశారు.

ఇక ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను అవార్డులను కోరుకోనని, ప్రజల గుండెల్లో తనపై ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదని చిరు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ పట్ల తనకు అత్యంత గౌరం వుందని, కళను గుర్తించి అవార్డులు ఇస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక చివర్లో చిరు.. తానెందుకు రాజకీయాల నుంచి దూరమయ్యారో వివరించారు. ప్రస్తుత రాజకీయాలు.. ఆరోగ్యకరంగా లేవని, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి కానీ, ఇప్పుడు ఎవరు అలా ఉండడం లేదని అన్నారు. ఇప్పుడు అందరూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. చాలా నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని, ఆ వ్యక్తిగత విమర్శలను తట్టుకోలేకనే తాను రాజకీయాల్లో నుంచి బయటికి రావాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లను తిప్పికొడితేనే రాజకీయాల్లో ఉండగలిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version