Site icon NTV Telugu

Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్

Chinmayi

Chinmayi

జ్ఞానపీఠ్ పురస్కారం భారతీయ సాహిత్యంలోనే అత్యున్నతమైనది, దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఒక తమిళ సాహితీవేత్తకు ఈ గౌరవం దక్కడం ఆ రాష్ట్రానికి గర్వకారణమే అయినా, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రముఖ కవి, రచయిత వైరముత్తుకు ఈ ఏడాది జ్ఞానపీఠ్ ప్రకటించగానే, అభినందనల కంటే వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2018లో వచ్చిన #MeToo ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరముత్తుకు అవార్డు దక్కిన వార్త బయటకు రాగానే, గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన చిన్మయి, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం వైరముత్తునే కాకుండా, ఆయనను సమర్థిస్తున్న సినీ, రాజకీయ దిగ్గజాలను కూడా ఆమె తన విమర్శలతో కడిగిపారేశారు.

Also Read:Movie Shootings: సినిమా షూటింగ్’లపై గ్యాస్ గుది బండ

ముఖ్యంగా, వైరముత్తును అభినందిస్తూ లోకనాయకుడు కమల్ హాసన్ పెట్టిన పోస్ట్‌ను చిన్మయి టార్గెట్ చేశారు. జయకాంతన్ తర్వాత 20 ఏళ్లకు ఒక తమిళుడికి ఈ గౌరవం దక్కడం తమిళనాడుకు గర్వకారణమని, వైరముత్తు తన ఆప్తమిత్రుడని కమల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చిన్మయి, కమల్ హాసన్ వంటి వ్యక్తుల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. “సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శక్తివంతులైన వ్యక్తులు, బాధితుల గోడును వినడానికి నిరాకరిస్తున్నారు. పురుషులు ఎప్పుడూ తమ ‘బ్రదర్స్, అంకుల్స్, ఫ్రెండ్స్’ వైపే నిలబడతారని మహిళలు గుర్తించాలి” అని ఆమె ఘాటుగా విమర్శించారు. నిజం మాట్లాడినందుకు తాను తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్, సింగింగ్ పరంగా నిషేధాన్ని ఎదుర్కొన్నానని, ఎంతోమంది మహిళల గొంతును తొక్కేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఎందరో మహిళలు తమ కలలను వదులుకున్నారు. వారి ఆవేదన ఎవరికీ పట్టదా? పురుషులు తమ స్నేహితుల కోసమే నిలబడతారని చెప్పడానికి ఇదే నిదర్శనం.” అని చిన్మయి శ్రీపాద అన్నారు.

Exit mobile version