Charmee Kaur:ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోతే చిత్ర బృందానికి బాధగానే ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమాను నిర్మించిన నిర్మాతకు ఆ ఫలితం మరింత కుంగదీస్తోంది. ప్రస్తుతం అదే పరిస్థితిని అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చింది నటి, నిర్మాత ఛార్మీ కౌర్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మీ నిర్మించారు. ఎన్నో అంచనాలతో ఆగస్టు 25 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్లాప్ టాక్ ను మూటగట్టుకొంది. ఇక ప్రమోషన్స్ లో ఛార్మీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, ఇలాంటి సినిమా ముందెన్నడూ చూడలేదని చెప్పుకురావడమే కాకుండా ఓటిటీ ఆఫర్ వచ్చినా వద్దనుకొని, ఎన్నో కష్టాలు పడి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పి కంటనీరు పెట్టుకొంది. అయితే ఆమె ఎమోషన్ సినిమా మీద పనిచేయలేదు. లైగర్ పరాజయం పాలయ్యింది. దీంతో నెట్టింట్లో ఆమెను ఏకిపారేస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్లాప్ పై మొదటిసారి ఛార్మీ నోరు విప్పింది.
“లైగర్ సినిమా ప్లాప్ అవ్వడం చాలా బాధగా ఉంది. జనాలు ఓటిటీకి చాలా అలవాటు పడ్డారు. ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ తో సినిమా చూడడానికే ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా థియేటర్లో చూడాలి అనే ఇంట్రెస్ట్ కలిగించే సినిమాలకు తప్ప ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు. ఇటీవల రిలీజ్ అయిన బింబిసార, కార్తికేయ 2, సీతారామం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. సుమారు రూ. 200 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక్కడ ఉన్నట్లు బాలీవుడ్ లో లేదు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకటి కాదు రెండు కాదు మూడేళ్లు లైగర్ సినిమా కోసం కష్టపడ్డాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటన్నింటిని దాటుకొని రిలీజ్ చేశాం. కానీ మా ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చలేదు. లైగర్ ప్లాప్ అవ్వడం నన్ను చాలా బాధకు గురిచేసింది” అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఛార్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.