NTV Telugu Site icon

తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అయిన ఎస్పీ చరణ్!

తల్లిదండ్రులు భౌతికంగా దూరమైనా… ప్రతి రోజు మనం చేసే పని, ప్రవర్తనతో వారిని తలుచుకుంటూనే ఉంటాం. గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసి ఎనిమిది నెలలు గడిచిపోయింది. అయినా ఇవాళ్టికీ కోట్లాది మంది పెదవులపై ఆయన పాడిన పాటలు అనునిత్యం పల్లవిస్తూనే ఉన్నాయి. అయితే… ఆయన లేని లోటును ఎక్కువగా ఫీల్ అయ్యేది ఖచ్చితంగా ఆయన కుమారుడు ఎస్పీ చరణే! అతను ఏం చేసినా… తండ్రి ఉన్నప్పుడు – లేనప్పుడు అందులో వ్యత్యాసాన్ని బాగా పోల్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. గాయకుడి గానే కాకుండా నటుడిగా, నిర్మాతగానూ పేరు తెచ్చుకున్న బాలు తనయుడు చరణ్ కు హాలీవుడ్ సినిమాలు చూడటం బాగా అలవాటు. తాజాగా క్లింట్ ఈస్ట్ ఉడ్ తెరకెక్కించిన ‘రిచర్డ్ జ్యువెల్’ మూవీని చూసి… తన తండ్రిని ఎంత మిస్ అయ్యాడో మరోసారి తలుచుకున్నాడు చరణ్. ఏదైనా హాలీవుడ్ సినిమా చూడగానే, అది నచ్చితే వెంటనే తండ్రికి సజెష్ చేసే వాడట చరణ్. బాలుగారు ఎంత బిజీగా ఉన్నా అదే రాత్రి ఆ సినిమాను చూసేసే వారట. అలా క్లింట్ ఈస్ట్ ఉడ్ నటించి, నిర్మించి దర్శకత్వం వహించిన ‘ది మ్యూల్’ చిత్రాన్ని తండ్రికి చూడమని చెప్పగానే, దానిని చూసిన బాలు… ఆ మర్నాడు అంతా ఆ సినిమా గురించే మాట్లాడుతూ ఉన్నారని చరణ్ తలుచుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా క్లింట్ ఈస్ట్ ఉడ్ ను ఉద్దేశించి చెబుతూ, ‘మీరు రూపొందించిన ‘రిచర్డ్ జ్యువెల్’ మూవీ చూశాను. ఆణిముత్యం లాంటి ఈ సినిమాను చూడమని చెప్పడానికి మా నాన్న నా పక్కన లేరు. నేను ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండండి. ఓ గొప్ప చిత్రాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్ అయిపోయాడు చరణ్! బయోగ్రాఫికల్ డ్రామా ‘రిచర్డ్ జ్యువెల్’ ను 2019లో క్లింట్ ఈస్ట్… ఉడ్ పాల్ వాసర్ హాల్టర్ తో తెరకెక్కించాడు. ఇప్పుడిది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.