Unstoppable 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో మాజీ సీఎం, తన బావ చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను బాలయ్య తన బావ చంద్రబాబును అడిగారు. ముఖ్యంగా బిగ్ డే, బిగ్ అలయన్స్, బిగ్ మిస్టేక్, బిగ్ ఫియర్, బిగ్ డెసిషన్ అన్న పదాలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. ఈ మేరకు బిగ్ మిస్టేక్ అన్న పదానికి చంద్రబాబు ఏం సమాధానం ఇచ్చారంటే.. 2003లో తనపై అలిపిరిలో అటాక్ జరిగిందని.. ఆ సమయంలో తాను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకున్నానని.. కానీ అప్పుడు ఎన్నికలు అనుకున్న సమయంలో జరగకుండా లేటుగా జరిగాయని చంద్రబాబు వివరించారు.
Read Also: UnStoppable 2: భలేగా బావ-బావమరిది.. మజాగా మామా అల్లుళ్ళు..!!
అయితే అదే సమయంలో దేశంలో వాజ్‌పేయి గారు కూడా తనను చూసి ఇండియా ఈజ్ షైనింగ్ అనే నినాదంతో పార్లమెంట్‌ను రద్దు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరినీ చూసి అదే సమయంలో ఒడిశాలో నవీన్ పట్నాయక్, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ కూడా అసెంబ్లీలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారని.. అయితే నలుగురిలో ముగ్గురుం ఓడిపోయామని.. ఒక్కరు మాత్రమే గెలిచారని చంద్రబాబు బాలయ్యకు సమాధానం ఇచ్చారు. తమ మీద నమ్మకంతో తాము తీసుకున్న నిర్ణయాలు వేరే వాళ్లపై కూడా ప్రభావం చూపిస్తాయని.. ఆరోజు తాను అలా అసెంబ్లీని రద్దు చేయకుండా ఉంటే చరిత్ర మరో విధంగా ఉండేదేమోనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తన జీవితంలో తాను చేసిన తప్పు అదేనన్నారు. ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పుడే తనకు తెలిసిందన్నారు. అటు తన జీవితంలో తాను ఎవరికీ భయపడలేదని బిగ్ ఫియర్ అనే పదానికి సమాధానంగా చంద్రబాబు తెలిపారు.
