Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్

Chandan Anand 1 300kb

Chandan Anand 1 300kb

Chandan Anand: సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు ఎన్నో ఏళ్లుగా పనిచేసినా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ ఒక్క సినిమా వారి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు నటుడు చందన్ కే ఆనంద్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ‘హనుమాన్ అంశ్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ కే ఆనంద్ తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాన్‌స్టర్’ సినిమాలో తాను కూడా నటిస్తున్నట్లు చెప్పారు. తన పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని చందన్ తెలిపారు. ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ఇక షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలో కూడా తాను నటించినట్లు చందన్ వెల్లడించారు. ఈ అవకాశం ఇచ్చిన ‘కింగ్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంటే ‘హనుమాన్ అంశ్’ లో కనిపించిన చందన్ ఆనంద్ ఇకపై ఒకేసారి బాలీవుడ్‌లోని ఇద్దరు టాప్ స్టార్స్ సినిమాల్లో కనిపించబోతున్నారన్నమాట. సల్మాన్, షారుఖ్‌లతో కలిసి పనిచేయడంపై కూడా చందన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. సెట్‌లో సూపర్‌స్టార్ చుట్టూ ఎప్పుడూ చాలా మంది ఉండటంతో వారితో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం రాలేదని చెప్పారు. అయినప్పటికీ సల్మాన్ తనను ఎంతో ఆప్యాయంగా కలిశారని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి సల్మాన్ ఖాన్‌కు పెద్ద అభిమాని అని, తాను సల్మాన్‌తో కలిసి పనిచేస్తున్న విషయం చూసి తన తండ్రి ఎంతో సంతోషించారని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

చందన్ ఆనంద్‌కు ఈ స్థాయిలో అవకాశాలు రావడం వెనుక ఆయన దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణం ఉంది. సినిమాలు, టెలివిజన్‌లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆయన ‘చైన్ కులీ కి మైన్ కులీ’లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ‘ఫైటర్’, ‘దేవా’, ‘హోమ్‌బౌండ్’ వంటి సినిమాల్లోనూ నటించారు. ‘క్లాస్’ వంటి వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఇన్ని సినిమాలు, సిరీస్‌లు చేసినా చందన్‌కు మంచి గుర్తింపు మాత్రం ‘హనుమాన్ అంశ్’ తోనే వచ్చింది. ఈ సినిమాలో రామ్ నందన్ భోసలే పాత్రలో నటించిన చందన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు దక్కింది. సినిమా విజయం తర్వాత ఆయనకు వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైన చందన్ ఆనంద్‌కు ఇకపై మరిన్ని పెద్ద అవకాశాలు రావడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా కొనసాగిన ప్రయాణంలో ఆలస్యంగా వచ్చిన ఈ గుర్తింపు ఇప్పుడు ఆయన కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.