సినిమాకి అదిరిపోయే టైటిల్ పెట్టి, కోట్లు కుమ్మరించి ప్రమోషన్స్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించి థియేటర్లు బుక్ చేసుకున్న తర్వాత… సడెన్గా టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డ్ చెబితే నిర్మాత పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇప్పుడు ఇదే భయం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినిమాల పేర్లను ఎప్పుడైనా మార్చే పూర్తి అధికారం తమకు ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అక్టోబర్ 26న జారీ చేసిన ఈ కొత్త అడ్వైజరీ లెటర్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. సినిమా పోస్టర్లు, టీజర్లు లేదా సెన్సార్ అప్లికేషన్లో పొందుపరిచిన టైటిల్ ఫైనల్ కాదు. పునఃపరిశీలన కమిటీ (రివ్యూ కమిటీ)కి ఆ టైటిల్ను రివ్యూ చేసి, మార్చమని ఆదేశించే సర్వాధికారాలు ఉంటాయి. కాబట్టి సెన్సార్ సర్టిఫికెట్ చేతికి రాకముందే సినిమా పేరును ఫైనల్ చేసి ప్రచారం చేయొద్దని బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా, టీజర్లు లేదా ట్రైలర్లలో ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించేశాం కదా అని.. ఆ సాకుతో సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒత్తిడి తీసుకురావద్దని తేల్చి చెప్పింది. నిర్మాతలు సొంతంగా నిర్ణయించుకున్న రిలీజ్ షెడ్యూల్స్ కోసం సెన్సార్ బోర్డ్ ఎలాంటి మినహాయింపులు ఇవ్వదని స్పష్టం చేసింది. అలాగే గ్రాఫిక్స్ (VFX), బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ మిక్సింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వంద శాతం పూర్తయిన సినిమాలను మాత్రమే సర్టిఫికేషన్ కోసం సమర్పించాలని ఆదేశించింది.
సెన్సార్ బోర్డ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై సినీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా బడా హీరోల సినిమాలకు ఏడాది ముందే టైటిల్ అనౌన్స్ చేసి, కోట్లాది రూపాయలతో ప్రీ-రిలీజ్ ప్రమోషన్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. పండుగ సీజన్లను టార్గెట్ చేసుకుని ముందుగానే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. అంతా పూర్తయ్యాక తీరా లాస్ట్ మినిట్లో టైటిల్ మార్చమంటే సినిమా మనుగడే ప్రశ్నార్థకమవుతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రిలీజ్ డేట్ మారితే పండుగ సీజన్ కలెక్షన్లు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సెన్సార్ బోర్డ్ నిర్ణయాలు సినీ పరిశ్రమను అగాధంలోకి నెట్టేలా ఉన్నాయని ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మండిపడుతుండగా, తక్షణమే ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేరళ ఫిల్మ్ ఛాంబర్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.

