Krishna-NTR: యన్టీఆర్ – కృష్ణ ‘అన్నదమ్ముల అనుబంధం’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brotherly Relationship Between NTR Krishna: నిజజీవితంలో నటరత్న యన్టీఆర్ కు వీరాభిమాని అయిన నటశేఖర కృష్ణ ఆ తరువాత ఆయనతోనే పలు విషయాల్లో పోటీపడ్డారు. ఏది ఏమైనా తమది అన్నదమ్ముల అనుబంధం అని ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ చెప్పేవారు. యన్టీఆర్ కంటే కృష్ణ అక్షరాలా ఇరవై సంవత్సరాల మూడు రోజులు చిన్నవారు. యన్టీఆర్ 1923 మే 28న జన్మించగా, కృష్ణ 1943 మే 31న కన్నుతెరిచారు. చదువుకొనే రోజుల నుంచీ యన్టీఆర్ సినిమాలంటే విపరీతంగా అభిమానించేవారు కృష్ణ. ముఖ్యంగా యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’ చిత్రం అంటే కృష్ణకు ఎంతో ఇష్టం. ఆ చిత్రాన్ని దాదాపు 20 సార్లకు పైగా చూశానని కృష్ణ పలు మార్లు చెప్పారు. అలాగే తన చిన్నతమ్ముడు జి.ఆదిశేషగిరిరావును యన్టీఆర్ సోదరులు నిర్మించిన ‘జయసింహ’ చిత్రానికి తీసుకువెళ్ళారట. అప్పుడు ఆ సినిమా పాటల పుస్తకం వెనకాల తమ తదుపరి చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ను ప్రకటించారు యన్టీఆర్ సోదరులు. ఆ బొమ్మను చూసినప్పుడే కృష్ణ మనసులోనూ ‘అల్లూరి సీతారామరాజు’పై అభిమానం కలిగిందని ఇటీవల కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
ఇక చిత్రసీమలో కృష్ణ అడుగుపెట్టే సమయంలోనే యన్టీఆర్ తన తొలి దర్శకత్వ చిత్రం ‘సీతారామకళ్యాణం’ ఏర్పాట్లలో ఉన్నారు. ఆ సినిమాలో రామలక్ష్మణుల పాత్ర కోసం యన్టీఆర్ అన్వేషిస్తున్నారని తెలిసిన కృష్ణ ఆయనను కలిశారు. అప్పుడు కృష్ణ వయసు 18 ఏళ్ళు మాత్రమే. అందువల్ల యన్టీఆర్, కృష్ణను చూసి మరీ చిన్నపిల్లాడిలా ఉన్నాడని చెప్పి పంపించారు.. అయినా కృష్ణ నిరాశ చెందక ప్రయత్నాలు మొదలెట్టారు. అలా ఏయన్నార్ కథానాయకునిగా తెరకెక్కిన ‘కులగోత్రాలు’ , జగ్గయ్య హీరోగా రూపొందిన ‘పదండి ముందుకు’ చిత్రాలలో చిన్న వేషాలు వేశారు. ఆ చిత్రాలలో తెరపై తనను చూసుకున్న తరువాత కృష్ణలో ఆత్మస్థైర్యం పెరిగింది. తరువాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితో తెరకెక్కిస్తున్న ‘తేనెమనసులు’ చిత్రం ద్వారా కృష్ణ ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా పరిచయం అయ్యారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తన అభిమాన నటుడు యన్టీఆర్ తో నటించాలని తొలి నుంచీ ఆరాటపడ్డారు కృష్ణ. యన్టీఆర్ తన బావమరిది యు.విశ్వేశ్వరరావు నిర్మిస్తున్న ‘నిలువుదోపిడి’లో కృష్ణకు అవకాశం కల్పించారు. అయితే ఈ విషయం తెలిసిన నిర్మాత డి.రామానాయుడు యన్టీఆర్ తో తాను తెరకెక్కిస్తున్న ‘స్త్రీ జన్మ’లో కృష్ణను రామారావు తమ్ముని పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అలా యన్టీఆర్ తో కృష్ణ తొలిసారి కలసి ‘స్త్రీ జన్మ’లో తమ్ముని పాత్రలో నటించారు. చిత్రమేంటో కానీ, ఆ తరువాత కూడా యన్టీఆర్ తో కృష్ణ నటించిన అన్ని చిత్రాల్లోనూ వారిద్దరూ అన్నదమ్ములుగానే నటించడం విశేషం! యన్టీఆర్ తో కృష్ణ ఐదు చిత్రాలలో కలసి నటించారు. ఆ సినిమాలేవంటే – స్త్రీ జన్మ (1967), నిలువుదోపిడి (1968), విచిత్రకుటుంబం (1969), దేవుడు చేసిన మనుషులు (1973), వయ్యారి భామలు – వగలమారి భర్తలు (1982). అందువల్లే తమది అన్నదమ్ముల అనుబంధం అని కృష్ణ చెప్పేవారు.
యన్టీఆర్ నటించిన అనేక చిత్రాల విడుదల సమయంలోనే కృష్ణ తన సినిమాలనూ విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద పోటీ సాగింది. దాదాపు యన్టీఆర్ నటించిన 15 చిత్రాలకు పోటీగా కృష్ణ చిత్రాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా వారిద్దరి మధ్య పోటీ అంటే 1977 సంక్రాంతి సంబరాల్లో విడుదలైన యన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’, కృష్ణ నిర్మించిన ‘కురుక్షేత్రం’ చిత్రాలనే గుర్తుచేసుకుంటారు జనం. ప్రతీ సంక్రాంతికి యన్టీఆర్, కృష్ణ సినిమాలు ఖచ్చితంగా విడుదలవుతూ వచ్చేవి. ఒకసారి ఒకరిది విజయం సాధిస్తే, మరోసారి మరొకరిది సక్సెస్ చూసిన సందర్భాలూ ఉన్నాయి.
ఇక రాజకీయాల్లోనూ యన్టీఆర్ కు తొలుత జై కొట్టారు కృష్ణ. 1982లో యన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పి ఎన్నికల ప్రచారం చేస్తూండగా, కృష్ణ తన 200వ చిత్రం ‘ఈనాడు’లో యన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జెండాలు చూపించి, వార్తల్లో నిలిచారు. అయితే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి, యన్టీఆర్ కు వ్యతిరేకంగా అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. 1984 డిసెంబర్ లో ఎన్నికల ప్రచారంలో నంద్యాలలో కృష్ణపై యన్టీఆర్ ఫ్యాన్స్ దాడి చేశారు. అప్పట్లో ఈ అంశం పెద్ద సంచలనం సృష్టించింది. 1989లో యన్టీఆర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ తరపున కృష్ణ కృషి చేశారు. ఆ ఎన్నికల్లో కృష్ణ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. అయితే రెండేళ్ళకే మళ్ళీ ఎన్నికలు రాగా, అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి 1991లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నుంచీ కృష్ణ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. యన్టీఆర్ 1994లో మళ్ళీ విజయభేరీ మోగించగా, ఆ తరువాత సినిమా రంగం తరపున యన్టీఆర్ కు జరిగిన అత్యంత భారీ సత్కారంలో కృష్ణ కూడా పాల్గొని, ఆయనపై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన ‘యన్టీఆర్ జాతీయ అవార్డు’ను 2003 సంవత్సరానికి గాను కృష్ణ అందుకోవడం విశేషం! ఆ సందర్భంలోనూ రామారావుపై తనకున్న అభిమానాన్ని, అనుబంధాన్ని కృష్ణ స్మరించుకున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!