ఒకప్పుడు మాధురీ దీక్షిత్ తెరపై కనిపిస్తే చాలు అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించేది. ఇప్పుడు అభినేత్రిగానూ అదే తీరున మురిపిస్తున్నారు మాధురీ దీక్షిత్. గత సంవత్సరం మాధురి నటించిన ‘మజా మా’ చూసిన వారెవరికైనా ‘ఆంటీ అందం… అదరహో…’ అనిపించక మానదు. నవతరం ప్రేక్షకులు సైతం మాధురి అందాల అభినయానికి ఫిదా అవుతున్నారు. మళ్ళీ మాధురి ఏ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలనీ ఆసక్తితో ఉన్నారు. అందాల మాధురీ దీక్షిత్ ఒకప్పుడు ఎందరో రసికుల స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా పట్టాభిషిక్తురాలయింది. బహుశా, ఇప్పటికీ వారి కలల రాణిగా రాజ్యమేలుతూనే ఉండవచ్చు. ఎందుకంటే, మాధురి దీక్షిత్ అందాల అభినయమే కాదు, ఆమె నాట్యం సైతం యువకులను జివ్వు మనిపించేది.
అసలు మాధురి నాట్యం కోసమే జనం సినిమాలకు పరుగులు తీసేవారు. ఆ మాటకొస్తే – మూడేళ్ళ ప్రాయంలోనే మాధురి నాట్యం చేయడం ఆరంభించింది. ఆమెలోని ప్రతిభను గమనించిన కన్నవారు ప్రోత్సహించారు. కథక్ లో శిక్షణ ఇప్పించారు. దాదాపు ఎనిమిదేళ్ళు కథక్ నాట్యం అభ్యసించిన మాధురీ దీక్షిత్ తన నాట్యంతో ఇట్టే జనాన్ని కట్టిపడేసేవారు. చదువుకొనే రోజుల్లోనే మాధురీ దీక్షిత్ ఆటపాటల్లోనూ తనదైన బాణీ పలికించారు. స్కూల్ డే, కాలేజ్ డే ఎక్కడైనా మాధురీ నృత్యం ఉండాల్సిందే. మైక్రోబయాలజీలో బియస్సీ చేస్తూ ఉండగానే చదువుకు స్వస్తి పలికి, చిత్రసీమవైపు అడుగులు వేశారామె. హిరేన్ నాగ్ రూపొందించిన ‘అబోధ్’లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు మాధురి. తరువాత “ఉత్తర్ దక్షిణ్, మోహ్రే’ చిత్రాల్లో నటించారామె. అయితే అనిల్ కపూర్ తో యన్.చంద్ర తెరకెక్కించిన ‘తేజాబ్’ ఆమెను రాత్రికి రాత్రి సూపర్ హీరోయిన్ గా నిలిపిందని చెప్పవచ్చు. ఇందులో “ఏక్ దో తీన్…” పాటలో మాధురీ దీక్షిత్ నృత్యం కుర్రకారును కిర్రెక్కించింది. యువకులకు నిద్ర లేకుండా గిలిగింతలు పెట్టింది. ఆ పై అనిల్ కపూర్ తో మాధురి నటించిన “రామ్ లఖన్, పరిందా, బేటా” వంటి చిత్రాలు ఉర్రూత లూగించాయి. ఆమిర్ ఖాన్ తో నటించిన ‘దిల్’, సంజయ్ దత్ తో మురిపించిన ‘సాజన్’,’ఖల్ నాయక్’, సల్మాన్ ఖాన్ తో అభినయించిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’, షారుఖ్ ఖాన్ తో అలరించిన ‘దిల్ తో పాగల్ హై’ వంటి సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ చిత్రాలన్నీ వసూళ్ళ వర్షం కురిపించాయి. అన్నిటా మాధురీ దీక్షిత్ అందం అగ్రతాంబూలం అందుకుందని చెప్పవచ్చు.
మాధురీ దీక్షిత్ అడుగు పెట్టే నాటికి శ్రీదేవి, మీనాక్షి శేషాద్రి తమదైన నృత్యంతో అలరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మాధురీ దీక్షిత్ తానూ నాట్యంతో పరవశింప చేయగలనని నిరూపించుకున్నారు. సరోజ్ ఖాన్ నృత్య దర్శకత్వంలో మాధురీ దీక్షిత్ నర్తించిన గీతాలు యువతను విశేషంగా ఆకర్షించాయి. ఆ తరువాతి రోజుల్లోనూ మాధురీ దీక్షిత్ తనదైన అభినయంతో సాగారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుసేన్ తనకంటే వయసులో ఎంతో చిన్నదైన మాధురి అందం చూసి బందీ అయిపోయారు. మాధురితో ఆయన ‘గజగామిని’ అనే చిత్రాన్నీ స్వీయ దర్శకత్వంలో రూపొందించి, ఆమె అందానికే ఓ నివాళిగా అందించడం విశేషం! పెళ్ళయి పిల్లల తల్లి అయినా, ఇప్పటికీ మాధురీ దీక్షిత్ లోని ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు భావిస్తూనే ఉంటారు. మరి మాధురి మళ్ళీ ఏ సినిమాతో తన అభిమానులకు కనువిందు చేస్తుందో చూడాలి.
