అజయ్ దేవగన్‌ను బాలీవుడ్‌లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్‌లో పాపులర్. అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అజయ్ దేవగన్.. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో వెంకట రామరాజు పాత్రలో కనిపించి మురిపించారు.
అజయ్ దేవగన్ 1969 ఏప్రిల్ 2న ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి వీరూ దవగన్ హిందీ చిత్రసీమలో పేరు మోసిన ఫైట్ మాస్టర్. అజయ్ అసలు పేరు విశాల్ వీరూ దేవగన్. చిన్నతనం నుంచీ తండ్రితో పాటు షూటింగ్స్ చూడడం వల్ల అజయ్ మనసు సహజంగానే సినిమా ఆకర్షణకు గురయింది. తండ్రి పర్యవేక్షణలో తన శరీరాన్ని తీర్చిదిద్దుకున్న అజయ్ దేవగన్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’లోనే హీరోగా మార్కులు సంపాదించారు. అప్పటి నుంచీ పలు యాక్షన్ డ్రామాస్ లో నటించి ఆకట్టుకున్నారు అజయ్. అతను స్టార్ గా సాగుతున్న సమయంలోనే బాలీవుడ్ లో సూపర్ హీరోయిన్ అనిపించుకుంటోంది కరిష్మా కపూర్. ఆమెతో కొంతకాలం ప్రేమాయణం సాగించారు అజయ్. ఆ తరువాత ఇద్దరూ ఎందుకనో విడిపోయారు. తరువాత తనతో ‘గుండారాజ్’లో కలసి నటించిన కాజోల్ తో ప్రేమలో పడ్డారు అజయ్. అదే సమయంలో కాజోల్ సైతం బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంటోంది. షారుఖ్ ఖాన్ హిట్ పెయిర్ గా కాజోల్ నిలిచారు. అజయ్, కాజోల్ ప్రేమను ఇరు వైపులవారు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే పెళ్ళాడిన అజయ్-కాజోల్ దంపతులకు ఇద్దరు పిల్లలు.
అనేక యాక్షన్ మూవీస్ లో మెప్పించిన అజయ్, విలక్షణమైన పాత్రలు లభిస్తే మాత్రం వదిలేవారు కాదు. ఆ రీతిన 1998లో మహేశ్ భట్ తెరకెక్కించిన ‘జక్మ్’, 2002లో రాజ్ కుమార్ సంతోషి రూపొందించిన ‘ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు అజయ్ దేవగన్. తన తండ్రిలాగే పేరు మోసిన యాక్షన్ మాస్టర్ శెట్టి తనయుడైన రోహిత్ శెట్టితో అజయ్ అనుబంధం ప్రత్యేకమైనది. రోహిత్ దర్శకుడు కావడానికి అజయ్ ఎంతగానో సహకరించారు. రోహిత్ తొలి చిత్రం ‘జమీన్’ మొదలు ‘బోల్ బచ్చన్’ దాకా వరుసగా ఎనిమిది సినిమాల్లో అజయ్ నటించారు. “సింగమ్” సిరీస్ లోనూ, “గోల్ మాల్” ఫ్రాంచైజ్ లోనూ అజయ్ దేవగన్ తోనే రోహిత్ శెట్టి సాగారు. మన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’లోనూ అజయ్ దేవగన్ హీరోగా అభినయించారు. నవరసాలు పోషించి మెప్పించాలన్నదే అజయ్ లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే అజయ్ తనదైన పంథాలో పయనిస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ‘రన్ వే 34’లో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కాక ‘మైదాన్, సర్కస్, థ్యాంక్ గాడ్, భోలా, దృశ్యం-2’ చిత్రాల్లోనూ అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ చిత్రాలతోనూ అజయ్ తన అభిమానులను అలరిస్తారని చెప్పవచ్చు.
(ఏప్రిల్ 2న అజయ్ దేవగన్ పుట్టినరోజు)
