Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా చేస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కామెడీ హర్రర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నడట మారుతి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక గత కొన్నిరోజులుగా ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యంగా కనిపిస్తున్నాడన్న వార్తలు వైరల్ గా మారాయి. ఒక ఆత్మ, ప్రభాస్ లోకి రావడం.. దాని వలన ఫన్ జనరేట్ అవుతుందని అది మారుతి మార్క్ కామెడీ ఉంటుందని చెప్పుకొస్తున్నారు.
ఆరడుగుల కటౌట్ తో కామెడీ ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడును ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నటుడు ఎవరో కాదు.. ట్యాలెంటెడ్ యాక్టర్ బొమన్ ఇరానీ. ఈ సినిమాలో బొమన్.. ప్రభాస్ కు తాతగా కనిపించనున్నాడట. ఈ కథలో తాత పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నదట. తాత కోరిక మేరకే ప్రభాస్ ఒక పాతబడిన ఇంటికి వెళ్తాడని, అక్కడే ప్రభాస్ ను ఆత్మ ఆవహిస్తుందని అంటున్నారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న పాత్ర కాబట్టి ఇందుకోసం ప్రముఖ నటుడు కోసం వెతుకుతుండగా బొమన్ ఆ పాత్రకు న్యాయం చేయగలడని నమ్మి ఆయనను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొమన్.. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కు తాతగా నటించి మెప్పించాడు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా తెలిపే వరకు ఎదురు చూడాల్సిందే.
