‘బార్డర్’ సినిమా బాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయి. సాధారణంగా హిందీ తెరపై బోలెడు రొమాంటిక్ సినిమాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో చాలా చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ అనిపించుకుంటాయి కూడా. కానీ, ‘బార్డర్’ దేశభక్తితో ఉప్పొంగే చిత్రం. లాంగేవాలా ప్రాంతంలో మన వీర జవాన్లు ప్రదర్శించిన సాహసాలకు తెర రూపం. ఎందరో సైనికుల త్యాగాలకు వెండితెర తార్కాణం…
జేపీ దత్తా ‘బార్డర్ ‘ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇప్పటికి 24 ఏళ్లు పూర్తైనప్పటికీ… అక్షయ్ ఖన్నా, సునీల్ శెట్టి, సన్నీ డియోల్ స్టారర్ అంటే సినీ ప్రియులకి, జాతీయ వాదులకి ఎంతో ఇష్టం. అందుకే, ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ హర్షనీయమైన నీర్ణయం తీసుకుంది. ‘బార్డర్’ సినిమాని పలు నగరాల్లో ఆర్మీ జవాన్లు, అధికారులకి, వారి వారి కుటుంబాలకి చూపించబోతున్నారు.
Read Also : గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు!
లాంగేవాలా యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఆ చారిత్రక సందర్భంగా ఈ తరం సైనికులకి జేపీ దత్తా రూపొందించిన వెండితెర అద్భుతం ప్రదర్శించనున్నారు.
‘బార్డర్’ స్పెషల్ షోస్ కు దర్శకనిర్మాత జేపీ దత్తా హాజరవుతారు. అయితే, 70 ఏళ్ల దత్తా అన్ని చోట్లా ఉండకపోవచ్చని సమాచారం. ఆయన సోదరుడు దీపక్ దత్తా కూడా కొన్ని చోట్లా ‘బార్డర్’ స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరవుతారు. సైన్యం, వారి కుటుంబ సభ్యులతో కలసి దీపక్ సినిమాని వీక్షిస్తారు. ఆయన లాంగేవాలా యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ఆనాటి ఫ్లైట్ లెఫ్టినెంట్ కావటం విశేషం!
భారత సైన్యం ఎంతో సాహసోపేతంగా కొనసాగించిన పోరాటాల్లో లాంగేవాలా కూడా ఒకటి. అది ఈ తరం వీర జవాన్లకు, ఆర్మీ అధికారులకి సినిమా రూపంలో ప్రేరణ కలిగించటం, మనమూ హర్షించాల్సిన విషయమే!