Urvashi Rautela: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా తెలుగులో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. విశేషం ఏమంటే.. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘బ్లాక్ రోజ్’ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. సంపత్ నంది కథను అందించిన ఈ సినిమాను ఆయన శిష్యుడు మోహన్ భరద్వాజ్ తెరకెక్కించారు. దీనిని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. విశేషం ఏమంటే.. ఈ నిర్మాతే ఇప్పుడు రామ్ – బోయపాటి కాంబోలో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు.
ఇదే సినిమాలో ఇప్పుడీ బ్లాక్ రోజ్ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ విషయమై కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నా, తాజాగా ఊర్వశీ రౌతేలా తన ఇన్ స్టాగ్రామ్ లో రామ్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేయడంతో ఇది అఫీషియల్ న్యూస్ అయిపోయింది. చిత్రం ఏమంటే.. శ్రీనివాస చిట్టూరి బ్యానర్ లో నటించిన హీరోయిన్లు సైతం రిపీట్ అవుతుంటారు. ఇదే బ్యానర్ లో రామ్ – లింగుస్వామి కాంబినేషన్ లో వచ్చిన ‘ది వారియర్’లో నాయికగా నటించిన కృతీశెట్టి.. ఇప్పుడు ఈ బ్యానర్ నుండి రాబోతున్న నాగచైతన్య – వెంకట్ ప్రభు మూవీలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ‘బ్లాక్ రోజ్’ మూవీని సైతం అతి త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
