BJP MP Sakshi Maharaj Fires On Adipurush Teaser: టీజర్ విడుదల అయినప్పటి నుంచి.. ఆదిపురుష్ సినిమా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. తొలుత గ్రాఫిక్స్ విషయమై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడ్డాయి. అనంతరం.. అందులోని పాత్రలు, వాటి వేషధారణలపై అభ్యంతరాలు వచ్చాయి. మీసాలు లేకుండా కేవలం గడ్డం, తోలు వస్త్రంతో హనుమంతుడి పాత్రని చూపించడం.. అలాగే రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపిస్తున్న తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం ఈ టీజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజర్‌లో అభ్యంతరకమైన సన్నివేశాలున్నాయని, ఇవి మతపరంగా కొందరి మనోభావాల్ని దెబ్బతీసే సన్నివేశాలని, వాటిని తొలగించాలని కోరారు. హిందూ పురాణ పురుషుల్ని తప్పుగా చూపించే సీన్లను తొలగించకపోతే చట్టపరమైన చర్చలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ‘ఆదిపురుష్’ టీజర్‌పై మండిపడ్డారు. ఆ టీజర్‌లో దేవుళ్ల పాత్రల్ని చూపించిన తీరుపై చాలామంది సాధవులు అభ్యంతరం వ్యక్తం చేశారని, ఈ చిత్రాన్ని నిషేధించాలని వాళ్లు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదేనని అన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ రావణుడి కంటే ఖిల్జీగా ఎక్కువగా కనిపిస్తున్నాడని అన్నారు. అలాగే.. హనుమంతుడి పాత్రకు మరీ గుర్తించలేనంతగా వక్రీకరించారని, ఇది ఏమాత్రం సహించలేని విషయమని అన్నారు. సినిమాటిక్ లిబర్టీలను అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చని ఫిల్మ్ మేకర్స్ భావిస్తుంటారని, కానీ ఇది ఏమాత్రం అంగీకరించబడదని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. ఇందులో భారతీయ సంస్కృతిని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇదే సమయంలో సీత పాత్ర మీద కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె సీతాదేవి కన్నా, సాధారణ హిందీ సినిమాల్లోని హీరోయిన్‌లాగే కనిపిస్తోందని, ఈ సినిమాని విడుదల చేయనివ్వమని కొన్ని హిందూ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
