బిగ్ బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం నామినేషన్స్ లో సోమవారం కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు పది మందిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అయితే మంగళవారం ఎపిసోడ్ లో మాత్రం పెద్దాయన వీరి విషయంలో కాస్తంత కనికరం చూపాడు. అది కూడా ఓ టాస్క్ ద్వారా మాత్రమే! 58వ రోజు మధ్యాహ్నం వరకూ ఇంటి సభ్యులు నామినేషన్ ప్రక్రియ మీద చర్చోపచర్చలు పెట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చిన బిగ్ బాస్ ఆ తర్వాత ‘జీవితమే ఒక ఆట’ అనే టాస్క్ ఇచ్చాడు. ఓ గదిలో ఇంటి సభ్యుల ఫోటోలతో బ్యాగులను పెట్టి, విజిల్ రాగానే ఇంటి సభ్యులంతా ఆ గదిలోకి వెళ్ళి ఒక్కో బ్యాగ్ ను తీసుకుంటూ సేఫ్ జోన్ లోకి రావాలి. అందులోకి చివరగా అడుగుపెట్టే వ్యక్తి, అతని చేతులో ఎవరి ఫోటో ఉన్న బ్యాగ్ తో వస్తాడో వారిద్దరూ డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్టు. వారిద్దరిలో ఎవరికి మిగిలిన ఇంటి సభ్యులు ఇమ్యూనిటీని ఎక్కువ అందిస్తే వారు గేమ్ లో కొనసాగుతారు. మిగిలినవారు ఓడిపోయినట్టు. ఫిజికల్ గా సాగే ఈ ఆటలో వెర్టిగోతో బాధపడుతున్న జెస్సీ కూడా పాల్గొన్నాడు. కెప్టెన్ షణ్ముఖ్ సంచాలకుడిగా వ్యవహరించడమే కాకుండా మధ్యలో బ్యాగ్ పెట్టే రూమ్ లోకి వెళ్ళి ఒకదానితో ఒకటి ముడిపెట్టి, ఆటను మరింత టఫ్ చేశాడు. మొత్తం మీద రకరకాల స్ట్రేటజీల అనంతరం ఈ గేమ్ లో యాని మాస్టర్ విజేతగా నిలిచింది. ఫస్ట్ రౌండ్ నుండి చివరి రౌండ్ వరకూ శ్రీరామ్ గట్టి పోటీ ఇచ్చాడు. అందరూ అతనికి ఇమ్యూనిటీని అందిస్తూ రావడంతో చివరి రౌండ్ వరకూ నిలిచాడు. ‘జీవితమే ఒక ఆట’లో విజేతగా నిలవడంతో యానీ మాస్టర్ ను బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ చేశారు.
మానస్ మంచి మనసుకు ఫిదా!
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఏకంగా ఐదుమంది మానస్ ను టార్గెట్ చేయడంతో, చూసే విక్షకుల నుండి కూడా అతనిపై బ్యాడ్ మార్క్ పడింది. అయితే చిత్రంగా అలాంటి మానస్ ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ నుండి నాటకీయ పరిణామాల మధ్య తప్పుకున్నాడు. గతంలో ఒకసారి యాని మాస్టర్ కు పవర్ ను అందించిన బిగ్ బాగ్ దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఈ వారం ఆమెకు ఇచ్చారు. దాంతో ఇప్పటికే నామినేషన్స్ నుండి తప్పుకున్న యానీకి, మరొకరిని తన పవర్ తో నామినేషన్స్ నుండి సేవ్ చేసే అవకాశం దక్కింది. ముందు వారం తనకు వచ్చిన లెటర్ ను ఇవ్వడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మానస్ త్యాగం చేశాడని, అందుకే మానస్ ను సేవ్ చేస్తున్నానని ఈ సందర్భంగా యాని తెలిపింది. దాంతో ఈవారం మొదట చెప్పిన పది మంది నుండి యానీ, మానస్ నామినేషన్స్ ప్రక్రియ నుండి సేవ్ అయ్యారు. సో… సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.
