NTV Telugu Site icon

Bhumika Chawla Birthday Special : అందాల అమరిక… భూమిక!

Bhumika

Bhumika

చూడగానే తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా, దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక.

భూమిక అసలు పేరు రచనా చావ్లా. 1978 ఆగస్టు 21న న్యూఢిల్లీలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ అందరిలోకి భిన్నంగా కనిపించాలని తపించేవారామె. 1997లో ముంబై చేరి అక్కడ పలు యాడ్ మూవీస్ లో నటించింది భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం ‘యువకుడు’ ద్వారా భూమిక చావ్లా సినిమా రంగానికి పరిచయమయ్యారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, భూమిక అందం మాత్రం నాటి కుర్రకారుకు బంధం వేసింది. పవన్ కళ్యాణ్ సరసన ‘ఖుషి’లో నటించేసి, యువతను మరింతగా కిర్రెక్కించారు భూమిక. నాగార్జునతో ‘స్నేహమంటే ఇదేరా’, వెంకటేశ్ తో ‘వాసు’, చిరంజీవితో ‘జై చిరంజీవా’, మహేశ్ తో ‘ఒక్కడు’, జూనియర్ యన్టీఆర్ తో ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో జనాన్ని ఆకట్టుకున్నారు భూమిక. తరువాత హిందీ చిత్రసీమవైపు పరుగుతీశారు. మధ్య మధ్యలో తమిళనాట కూడా తనదైన బాణీ పలికించారు. ఏది చేసినా భూమిక తెలుగు చిత్రాలతోనే అపూర్వ విజయం సాధించారని చెప్పవచ్చు.

భూమిక నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ‘మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి’వంటివి ఆమెకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. ప్రముఖ యోగామాస్టర్ భరత్ ఠాకూర్ ను వివాహమాడిన తరువాత ‘తకిట తకిట’ అనే తెలుగు చిత్రం నిర్మించారు. అందులో ప్రత్యేక పాత్రలో నటించారు. బాలకృష్ణ ‘రూలర్’లో ఓ కీలక పాత్ర పోషించిన భూమిక, ‘పాగల్’లో హీరో తల్లి పాత్రలో కనిపించారు. గోపీచంద్ ‘సీటీమార్’లోనూ భూమిక ముఖ్యపాత్ర ధరించారు. ఇటీవల విడుదలై విజయవిహారం చేస్తోన్న ‘సీతారామం’లోనూ భూమిక ముఖ్యపాత్రలో కనిపించారు. తెలుగు స్టార్ హీరోస్ తో అఖండ విజయాలు చూసిన భూమిక తరువాత ఆ స్థాయి సక్సెస్ చూడక పోయినా, ఆ నాటి అభిమానుల మదిలో ఇంకా ‘ఖుషి’ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కెరెక్టర్ రోల్స్ లోనూ భూమిక అభినయాన్ని చూస్తూ ఆ నాటి అభిమానులు ఆనందిస్తున్నారు.