పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందు నిలచింది. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.36.37 కోట్లు వసూలు చేసి విజయశంఖం పూరించింది. ఒక్క అమెరికాలోనే మొదటి రోజు మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీలో రూ.7.05 కోట్లు. ఇక ఇతర రాష్ట్రాలు, పరదేశాల్లో కలిపి రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. అంటే తెలుగు రాష్ట్రాలలో కాకుండానే మొత్తం రూ.9.95 కోట్లు కొల్లగొట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం విడుదల సమయంలో అమలులో ఉన్న ఆంక్షల కారణంగా రోజూ ఈ సినిమాపై చర్చోపచర్చలు జరిగాయి. దాంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమాపై ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలుగువారిలో ఆసక్తి నెలకొంది. తత్ఫలితంగానే రూ.9.95 కోట్లు బయట నుంచే లభించినట్టయింది.
ఇక నైజామ్ లో పంపిణీదారులు ఈ చిత్రం కోసం రోజూ ప్రతి థియేటర్ లో ఐదు ఆటల ప్రదర్శనకు అనుమతి సంపాదించారు. అలాగే నైజామ్ లో పెద్ద హీరోల చిత్రాలకు రేటు పెంచుకొనే వీలూ ఇంతకు ముందే కల్పించారు. తత్ఫలితంగా ‘భీమ్లా నాయక్’ నైజామ్ లో మొదటి రోజున రూ.11.85 కోట్లు పోగేసి, ఈ ఏరియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రథమ స్థానంలో నిలచింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిమిత ప్రదర్శన ఆటలు, సాధారణ రేట్లపైనే రూ.14.57 కోట్లు చూసింది. ‘భీమ్లా నాయక్’ సోలోగా రావడం వల్ల అక్కడ ఈ మూడు నెలల కాలంలో వచ్చిన చిత్రాలలో అన్నిటి కన్నా మిన్నగా ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించాయి. దాంతో ఆంక్షలు ఎలా ఉన్నా, రూ. 14.57 కోట్లు పోగేయగలిగింది. అక్కడ కూడా టాప్ టెన్ లో చోటు సంపాదించింది.
ఇలా ఏపీలో రూ. 14.57 కోట్లు, నైజామ్ లో రూ. 11.85 కోట్లు, ఇతర రాష్ట్రాలు, విదేశాలు కలిపి రూ. 9.95 కోట్లు వెరసి ఫస్ట్ డేన రూ. 36.37 కోట్లు మూట కట్టింది. మొదటి వారాంతంలో అంటే ఫిబ్రవరి 27 నాటికి ఎంత పోగేస్తుందో, ఫస్ట్ వీక్ ఎంత రాబడి చూస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనేలా చేసింది ‘భీమ్లా నాయక్’!