Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!

Picnic Movie 300kb

Picnic Movie 300kb

Picnic: కంటెంట్ బాగుంటే భాషల హద్దులు దాటి ఎలాంటి విజయాలు సాధిస్తాయో ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలు చూపించాయి. ఈ రెండు మలయాళం సినిమాలను నిర్మించిన భావనా స్టూడియోస్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ‘పిక్నిక్’ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు.. ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలకు సహ రచయితగా పనిచేసిన కిరణ్ జోసే ‘పిక్నిక్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ ప్రదీప్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీతగా దిలీష్ పోతన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సుజినా శ్రీధరన్, అక్షత అజిత్ కూడా తారాగణంలో భాగమయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ‘పిక్నిక్’ను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. పచ్చని కొండలు, రంగురంగుల పూల పొలాల మధ్య పోస్టర్‌ను చాలా ఆహ్లాదకరంగా డిజైన్ చేశారు. పోస్టర్ చూస్తేనే సినిమా మొత్తం కుటుంబంతో కలిసి చూసే సరదా ఎంటర్టైనర్‌గా ఉండబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. ‘96’, ‘సత్యం సుందరం’ వంటి సినిమాలకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. మలయాళం ప్రేక్షకులకే పరిమితం కాకుండా దక్షిణాది మార్కెట్‌లో మరింత విస్తరించాలనే ఉద్దేశంతో భావనా స్టూడియోస్ ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయనుంది. ‘పిక్నిక్’ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి మరో మలయాళ సినిమా కూడా చేరబోతోంది.

తెలుగు వెర్షన్ విషయంలోనూ మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ షోయింగ్ బిజినెస్ తెలుగు థియేట్రికల్ రిలీజ్ కోసం ‘పిక్నిక్’తో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ‘ప్రేమలు’ను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ సంస్థకు ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది. దీంతో ‘పిక్నిక్’పై కూడా తెలుగు మార్కెట్‌లో బజ్ పెరుగుతోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ అప్డేట్స్ త్వరలో వెలువడనున్నాయి.