(ఫిబ్రవరి 20న ‘భాగ్యరేఖ’కు 65 ఏళ్ళు)
పట్టుమని డజన్ సినిమాలు తీయలేదు. కానీ, దర్శకదిగ్గజం బి.యన్. రెడ్డి పేరు తెలుగు చలనచిత్రసీమలో సువర్ణాక్షర లిఖితమయింది. దక్షిణ భారతంలో తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఘన చరిత బి.యన్. రెడ్డి సొంతం. ఆయన రూపొందించిన చిత్రాలలో “మల్లీశ్వరి, రాజమకుటం” చిత్రాలు మినహాయిస్తే అన్నీ సాంఘికాలే. ఈ రెండు సినిమాల్లోనూ యన్.టి.రామారావు కథానాయకుడు కావడం విశేషం. యన్టీఆర్ తో బి.యన్. రెడ్డి తెరకెక్కించిన ఏకైక సాంఘిక చిత్రం ‘భాగ్యరేఖ’. 1957 ఫిబ్రవరి 20న ‘భాగ్యరేఖ’ విడుదలయింది. బి.యన్. తనదైన శైలితో ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు ఆకట్టుకొని, జనం ‘భాగ్యరేఖ’ను టైటిల్ క తగ్గట్టుగానే భాగ్యశాలిని చేశారు.
‘భాగ్యరేఖ’ కథ విషయానికి వస్తే – లక్ష్మి అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పసితనంలోనే కన్నవారిని పోగొట్టుకున్న లక్ష్మి, మేనమామ పంచన చేరుతుంది. మేనమామ భార్య జగదంబ గయ్యాళి. ఆమెకు ఓ బాబు, ఓ పాప. లక్ష్మికి 18 ఏళ్ళ వయసులో ఓ ధనవంతుల ఇంటి కోడలు అవుతుందని జోస్యం చెబుతారు. దానిని ఎవరూ అంతగా పట్టించుకోరు. జగదాంబ కొడుకు కోటయ్య మంచి మనసున్నవాడు. ఇంటి నుండి పారిపోయి మిలిటరీలో చేరతాడు. ఇక కూతురు కాత్యాయని అతిగారాబంతో పెరుగుతుంది. కాత్యాయనికి పెళ్ళి సంబంధం వస్తుంది. అయితే ఆమె కంటే చక్కగా ఉన్న లక్ష్మిని చూసి, వారు ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటారు. దాంతో గయ్యాళి జగదంబ లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళగొడుతుంది. తాను నమ్ముకున్న శ్రీవేంకటేశ్వర స్వామిపై భారం వేసి, తిరుమల చేరుతుంది లక్ష్మి. అక్కడ ఓ అమ్మాయిని రక్షించడంతో వారి కన్నవారు లక్ష్మిని చేరదీస్తారు. ఆ ఇంటి పెద్దబ్బాయి రవి, లక్ష్మిని చూసి ప్రేమిస్తాడు. తల్లిదండ్రులు కూడా ఆమోదిస్తారు. రవికి తన కూతురును ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్న అతని మేనమామ జగన్నాథమ్, లక్ష్మికి అప్పటికే పెళ్ళయిందని, ఆ మాటను జగదంబతో చెప్పిస్తాడు. దాంతో లక్ష్మి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయి తనకు చేతనైన పని చేసుకుంటూ జీవిస్తుంటుంది. జగదంబ కూతురు కాత్యాయని, పుల్లయ్యను ప్రేమించి ఇంట్లోని నగనట్రా తీసుకొని అతనితో ఉడాయిస్తుంది. పుల్లయ్య ఆమె నగలు అమ్మేసి జల్సాగా తిరుగుతారు. తరువాత కష్టాల పాలవుతారు. ఆ సమయంలో లక్ష్మి వారిని చేరదీస్తుంది. మిలిటరీ నుండి వచ్చిన కోటయ్యకు లక్ష్మిపై పడ్డ అపవాదు తెలుస్తుంది. దాంతో జగన్నాథాన్ని, జగదంబను తీసుకు వచ్చి అసలు విషయం చెప్పిస్తాడు. అది విని తట్టుకోలేక రవి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. లక్ష్మికి ఈ విషయం తెలిసి, తన ప్రార్థనలతో రవిని కాపాడుకుంటుంది. చివరకు రవి, లక్ష్మి పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
రవిగా యన్టీఆర్, లక్ష్మిగా జమున నటించిన ఈ చిత్రంలో రేలంగి, షావుకారు జానకి, సూర్యకాంతం, హేమలత, ఇ.వి.సరోజ, రమణారెడ్డి, సీఎస్సార్, గోవిందరాజుల సుబ్బారావు, నాగభూషణం, డాక్టర్ శివరామకృష్ణయ్య, కేవీయస్ శర్మ, అల్లు రామలింగయ్య, పద్మనాభం, బాలకృష్ణ, పేకేటి శివరామ్ ఇతర ముఖ్యపాత్రధారులు.
ఈ చిత్రానికి కథ, సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు సమకూర్చారు. ఈ సినిమాకు బి.యన్.రెడ్డి, పద్మరాజు స్క్రీన్ ప్లే రూపొందించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, ఎరమాకుల ఆదిశేషారెడ్డి పాటలు పలికించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఇందులోని “నీవుండేదా కొండపై… నా స్వామి…” అనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం విశేషాదరణ పొందింది. “తిరుమల మందిరా…”, “మనసా తెలుసా…”, “అందాల రాజెవడురా…” , “కన్నె ఎంతో సుందరి…”, “నీ సిగ్గే సింగారమే…”, “నా మొర వినరాదా…”, “మనసూగే…”, “లోకం గమ్మత్తురా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
పొన్నలూరు బ్రదర్స్ సమర్పణలో ఈ చిత్రం నిర్మితమయింది. ఆ రోజుల్లో ఈ సినిమా బి.యన్.రెడ్డి స్థాయి చిత్రం కాదనే విమర్శలు వినిపించాయి. పైగా “స్వర్గసీమ, మల్లీశ్వరి, బంగారుపాప” చిత్రాల తరువాత వచ్చిన చిత్రం కావడంతో ఆ కళాఖండాల సరసన ‘భాగ్యరేఖ’ నిలవలేదని జనం తేల్చారు. కానీ, ‘భాగ్యరేఖ’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిపీట్ రన్స్ లోనూ ఈ సినిమా మంచి ఆదరణ చూరగొంది.