2008లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘బధాయి హో’ టైటిల్ ను బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంచక్కా వాడేసుకుంటున్నారు. ఆ కథతో సంబంధం లేకుండానే, వేరే వేరే నటీనటులతో ‘బదాయి దో’ అనే సినిమా తీసేశారు. రాజ్ కుమార్ రావ్, భూమి ఫడ్నేకర్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఇందులో రాజ్ కుమార్ రావ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి భూమి అంటే ప్రేమ. చూస్తుండగానే ఆమెకు 31 సంవత్సరాలు, అతనికి 32 యేళ్ళు వచ్చేస్తాయి. స్కూల్ టీచర్ గా పనిచేసే భూమికి పెళ్ళంటే ఆసక్తి ఉండదు. ఆమె ఆలోచనలన్నీ వేరే ఉంటాయి. కొందరమ్మాయిలతో కలిసి భూమి డేటింగ్ చేస్తుంటుంది. ఆమె బలహీనత తెలిసి కూడా ఆమెనే పెళ్ళి చేసుకోవాలని రాజ్ కుమార్ రావ్ భావిస్తుంటాడు.
రకరకాల మాటలు చెప్పి చివరకు ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. చిత్రం ఏమంటే… వీరిద్దరే కలిసి కాపురం ఉండాల్సిన ఇంట్లోకి భూమి స్నేహితురాలు కూడా వచ్చి చేరుతుంది. అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. భూమిని రాజ్ కుమార్ రావ్ తన దారికి తెచ్చుకున్నాడా? ఇష్టం లేకుండానే పెద్దల కోసం పెళ్ళి చేసుకున్న భూమి మనసు మారిందా? ఆమె స్నేహితురాళ్ళు వీరిద్దరినీ అంత తేలిగ్గా వదిలిపెట్టేశారా? ఈ ప్రశ్నలన్నింటికి వెండితెర మీద సమాధానం చెప్పబోతున్నాడు దర్శకుడు హర్షవర్థన్ కులకర్ణి. ఏదేమైనా… కాస్తంత బోల్డ్ సబ్జెక్ట్ ను వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. సీమా పహ్వా, షీబా చద్దా, చుమ్ దురంగ్, లవ్లీన్ మిశ్రా, నితీష్ పాండే, శశిభూషణ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
