Saibal Bhattacharya: ప్రముఖ బెంగాలీ నటుడు సైబల్ భట్టాచార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం రాత్రి సైబల్ ఫేస్ బుక్ లైవ్ ఓపెన్ చేసి పదునైన కత్తితో చేతులు, తలను గాయపర్చుకున్నాడు. వీడియోలో “ఇక నా వలన కావడం లేదు.. నా భార్య, అత్తమ్మ” అంటూ చెప్తూనే చేయి కోసుకుపోవడంతో వీడియో కట్ అయిపోయింది. అందులో అతను ఏమి చెప్పాలనుకున్నాడో కూడా స్పష్టంగా లేకపోవడంతో ఆ లైవ్ చూసేవారందరు ఏదో ప్రాంక్ వీడియో అని లైట్ తీసుకున్నారు. ఇక నేటి ఉదయం అతనిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేయగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇక సైబల్ ‘ప్రోతోమా కాదంబిని’ అనే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇక ఇటీవల అతనికి అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ కు గురయ్యినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత కొన్నిరోజుల నుంచి సైబల్ డ్రగ్స్ కు బానిసగా మారినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇంట్లో సమస్యలు, డబ్బులేకపోవడంతోనే నటుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పలువురు తెలుపుతున్నారు. అయితే వీడియోలో తన భార్య, అత్త ల గురించి ఏదో చెప్పబోయి ఆగిపోవడంతో వారేమైనా నటుడును ఇబ్బందిపెట్టారా..? లేక వేరే కారణాలు ఉన్నాయా..? అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ విషయం తెలియడంతో బెంగాలీ ఇండస్ట్రీ మరోసారి ఉలిక్కిపడింది. ఇప్పటికే బెంగాలీ చిత్ర పరిశ్రమలో వరుస మోడళ్లు ఆత్మాహత్యకు గురవుతున్నారు. పల్లవి డే, బిడిషా, మంజుషా ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు సైబల్ కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో చిత్ర పరిశ్రమలో ఆందోళన మొదలయ్యింది.