Site icon NTV Telugu

Swathi Mutyam: వాయిదా పడిన బెల్లంకొండ తనయుడి చిత్రం!

Swathi Mutyamm

Swathi Mutyamm

Swathi Mutyam : Bellamkonda’s son’s film postponed!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి గణేశ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. ఇప్పటికే బెల్లంకొండ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని తమ్ముడు సాయి గణేశ్‌ ‘స్వాతిముత్యం’తో హీరోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడీ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.

ఈ విషయపై నిర్మాత నాగవంశీ ఓ ప్రకటన చేస్తూ, ”కొన్ని కారణాల వల్ల మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నాం. ఈ నిర్ణయం పట్ల మేం సంతోషంగా లేనప్పటికీ, వాయిదా వేయక తప్పడం లేదు. రిలీజ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు. విడుదల తేదీని ముందుగానే ప్రకటించి, విడుదల ప్రణాళికలతో పూర్తి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాం. కరోనా మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకు ముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి చూసి,ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి, మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి మునుపటిలాగ సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు. గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

 

Exit mobile version