Site icon NTV Telugu

Beast, KGF2, Jersey: ఆ మూడు సినిమాల విషయంలో ఏం జరుగబోతోంది?!

Beast Kgf

Beast Kgf

వచ్చే వారం వివిధ భాషలకు చెందిన, మూడు విభిన్న కథా చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘బీస్ట్’ ఏప్రిల్ 13న అంటే బుధవారం రాబోతోంది. ఆ రోజుకో ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే. దానికి ముందు వచ్చే బుధవారాన్ని క్రైస్తవులు ‘హోలీ వెడ్ నెస్’ గా భావిస్తారు. అందుకే తన ‘బీస్ట్’ చిత్రాన్ని శుక్రవారానికి రెండు రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా విజయ్ విడుదల చేయబోతున్నాడు. ఇక ఆ మర్నాడే అంటే గురువారం రోజు కన్నడ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ -2’ రిలీజ్ కాబోతోంది. అయితే రెండు సినిమాలకు ఉత్తరాదిలో ‘జెర్సీ’ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో మరోసారి తన సత్తా చాటిన షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమా ‘జెర్సీ’ని హిందీలోనూ అదే పేరుతో రీమేక్ చేశాడు. ఇది కూడా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ఈ మూడు చిత్రాలలో ఉత్తరాది వారు దేనివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

‘దిల్’ రాజుకు నిజంగా పరీక్షే!
ఇదిలా ఉంటే… ‘బీస్ట్’, ‘కేజీఎఫ్ -2’, ‘జెర్సీ’ సినిమాలతో ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు ‘దిల్’ రాజుకు ప్రత్యక్ష సంబంధం ఉంది. బుధ, గురు వారాల్లో విడుదల కాబోతున్న ఈ మూడు చిత్రాలూ ‘దిల్’ రాజుకు చెందినవే. విజయ్ ‘బీస్ట్’ తెలుగు రాష్ట్రాల హక్కులను ‘దిల్’ రాజు పొందారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా నిర్మిస్తున్నారు. కాబట్టి ‘బీస్ట్’ సక్సెస్ కావడమనేది ‘దిల్’ రాజుకు ఎంతో అవసరం. అలానే ‘కేజీఎఫ్ 1’కు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కుల్ని కూడా ‘దిల్’ రాజు తీసుకున్నారు. సో… ఈ రెండు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ కూ ఆయన రెండు రాష్ట్రాలలోనూ తగిన ధియేటర్లను కేటాయించాల్సి ఉంటుంది. అదే విధంగా హిందీ ‘జెర్సీ’ నిర్మాతల్లో ‘దిల్’ రాజు కూడా ఒకరు. ఈ హిందీ వర్షన్ ను రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో…. ఒకేవారం విడుదలవుతున్న మూడు సినిమాలనూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ‘దిల్’ రాజు భుజాలపై ఉంది!

Exit mobile version