నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మజన్మలబంధం ఉన్న కథలు బాగా అచ్చి వచ్చాయనే చెప్పాలి. ఏయన్నార్ కు హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టిన ‘బాలరాజు’ జానపదం అలాంటి కథనే. ఆ తరువాత జనం మదిలో ఆయన బాలరాజుగా నిలిచారు. ఇక 1964లో రూపొందిన ‘మూగమనసులు’ రెండు జన్మల కథతో తెరకెక్కి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఏయన్నార్ తో పూర్వజన్మగాథలు నిర్మిస్తే విజయం సాధించవచ్చునని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తలచారు. అంతకు ముందు ఏయన్నార్ తో “ఆరాధన, అంతస్తులు, ఆత్మబలం, దసరాబుల్లోడు, బంగారుబాబు” వంటి జనరంజకమైన చిత్రాలు నిర్మించారు రాజేంద్రప్రసాద్. తన హీరోతో మళ్ళీ ఓ వైవిధ్యమైన కథ రూపొందించాలని పూర్వజన్మ జ్ఞాపకాలతో ‘బంగారుబొమ్మలు’ కథను స్వీయ దర్శకత్వంలో తమ జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. ఇందులో మంజుల నాయికగా నటించారు. 1977 ఏప్రిల్ 14న విడుదలైన ‘బంగారుబొమ్మలు’ మ్యూజికల్ హిట్ అనిపించుకుంది.
కథ విషయానికి వస్తే- గోపికి గత జన్మ గుర్తుకు వస్తుంది. తన ప్రేయసి రాధను వెదుకుతూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. అతనికి రాణి అనే డాన్సర్ కనిపిస్తుంది. ఆమెను పట్టుకొని తన రాధ అంటాడు. ఆమె అతణ్ణో పిచ్చివాడిగా భావిస్తుంది. కానీ, రాణి తండ్రి ఓ సైంటిస్ట్. అతను పూర్వజన్మలపైనే పరిశోధన చేస్తుంటారు. రాణి, ఆమె తండ్రిని తన ఊరికి తీసుకువెళ్ళి, అక్కడ తన గత జన్మ కథను వివరిస్తాడు గోపి. ఆ జన్మలో జమీందార్ రెండో భార్య కొడుకు గోపి. పెద్ద భార్య కొడుకు కూడా వారితో పాటే జీవిస్తూ ఉంటాడు. పరువు, ప్రతిష్ఠకు ప్రాణమిచ్చేవాడు జమీందార్. గోపి తమ భవంతిలో పనిచేసే రాధను ప్రేమిస్తాడు. వారి పెళ్ళికి జమీందార్ అంగీకరించడు. కానీ, రాధను పెళ్ళి చేసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళి జీవిస్తుంటాడు గోపి.
ఆస్తి మొత్తం అతని అన్నకు రాసిస్తాడు తండ్రి. తరువాత తన పెద్దకొడుకు నిజరూపం తెలుస్తుంది జమీందార్ కు. గోపి తల్లి మరణిస్తుంది. తరువాత అనారోగ్యంతో ఉన్న జమీందార్ ను గోపి, రాధ వెళ్ళిచూస్తారు. వారిద్దరూ తండ్రికి దగ్గరవుతారని జమీందార్ పెద్దకొడుకు చంపిస్తాడు. ఈ కథంతా విన్న తరువాత రాణి తానే గతజన్మలో రాధను అని అర్థం చేసుకుంటుంది. అక్కడే రాధ, గోపి విగ్రహాలను పెట్టుకొని పూజలు చేస్తున్న జమీందార్ తన కొడుకు మళ్ళీ జన్మించి వచ్చాడని తెలుసుకొని మురిసిపోతాడు. ఊరంతా మెచ్చుకొనేలా గోపి, రాధ పెళ్ళి ఘనంగా జరిపిస్తాడు జమీందార్. అలా కథ సుఖాంతమవుతుంది.
ఇందులో సత్యనారాయణ,జగ్గయ్య, అంజలీదేవి, రాజబాబు, కేవీ చలం, ధూళిపాల, రావు గోపాలరావు, సూర్యకాంతం, ఛాయాదేవి నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే వి.బి.రాజేంద్రప్రసాద్ సమకూర్చారు. పాటలు-మాటలు ఆచార్య ఆత్రేయ అందించగా, కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. ఇందులోని “అయ్యయ్యో బంగరుబాబు…”, “ఓ సుబ్బయ్య సూరయ్య…”, “ఇది పొగరుబోతు పోట్ల గిత్తరా…”, “నువ్వాదరిని నేనీదరిని…”, “నేను నేనుగా…”, “అమ్మా… తీరిపోయిందా తీయనిబంధం…” వంటి పాటలు అలరించాయి. ముఖ్యంగా “నువ్వా దరిని నేనీ దరిని..” పాట అన్నిటికన్నా మిన్నగా ఆదరణ పొందింది.
‘బంగారు బొమ్మలు’కు ముందు ఏయన్నార్ ‘ఆలుమగలు’ 1977లోనే విడుదలై మంచి విజయం సాధించింది. ‘బంగారు బొమ్మలు’ ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే అక్కినేని అభిమానులు ఈ చిత్రంలోని పాటలతో ఆనందించారనే చెప్పాలి.
